తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని గోడపత్రిక ఆవిష్కరణ

Published: Wednesday September 14, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 13 ప్రజాపాలన ప్రతినిధి.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అసలు సిసలైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ అన్నారు.

మంగళవారం రోజున సిపిఎం తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల గోడపత్రిక ను తుర్కయంజాల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాటి నిరంకుశ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడు గూడు గుడ్డలేని పేదలకు అండగా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం జరిగిందన్నారు. దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో సుమారు 4000 మంది కమ్యూనిస్టులు వీర మరణం పొందడమే గాక లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదే అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణకే పరిమితం కాలేదని ఇది భారతదేశానికే దిక్సూచిగా వీరోచిత పోరాటంగా నిలిచిందన్నారు, కుల మతాలకతీతంగా సాగిన ప్రజా పోరాటం అన్నారు. కానీ నేడు తెలంగాణ సాయుధ పోరాటం గురించి వక్రభాష్యాలు చెబుతూ మతం రంగును పులుముతూ హిందూ ముస్లిం గొడవగా బిజెపి ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు... అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాస్తవాలను, కమ్యూనిస్టుల త్యాగాలను ప్రజలకు తెలియజెప్పేందుకు జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 16వ తేదీన తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రానికి ఈ బైక్ యాత్ర వస్తుందని యాత్రను జయప్రదం చేయడం కోసం పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఐ.భాస్కర్, బి.శంకరయ్య, కే.వెంకటకృష్ణ, బడుగు మాల్యాద్రి, గుర్రం. జంగయ్య, ఎన్.యాదగిరి, పి.మధు చెక్క రమేష్, మల్లేష్,జగన్ తదితరులు పాల్గొన్నారు.