ఎల్లకొండలో ఊరడమ్మ విగ్రహం ప్రతిష్ఠాపన

Published: Saturday December 17, 2022
* ఎల్లకొండ సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 16 డిసెంబర్ ప్రజా పాలన : గ్రామం సుభిక్షంగా పాడిపంటలతో సుఖ సంతోషాలతో జీవించేందుకు గ్రామ దేవతలను ఆరాధిస్తామని నవాబుపేట మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావుగారి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నవాబుపేట పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో ఊరడమ్మ విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఊరడమ్మ ఆలయంలో ఊరడమ్మ విగ్రహమూర్తులను ప్రత్యేకంగా తయారు చేయించి పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించామని తెలిపారు. విగ్రహమూర్తులను గుర్రపు బండి పై అందంగా అలంకరించి గ్రామ వీధుల గుండా ఊరేగించారు. డిజె సౌండ్ డప్పు వాయిద్యాలకు అనుకూలంగా యువకులు నృత్యంతో అలరించారు. వేద పండితులు ఊరడమ్మ విగ్రహం మూర్తులకు వేదం మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయనున్నామని స్పష్టం చేశారు. గ్రామ దేవతలను ప్రజలంతా భక్తి ప్రపత్తులతో కొలవడంతో సుఖశాంతులతో జీవిస్తారని ఆకాంక్షించారు. ప్రతి ఇంట ధాన్యాలతో సిరి సంపదలతో విలసిల్లేందుకు గ్రామ దేవతల ఆశీస్సులు లభిస్తాయని చెప్పారు. డిసెంబర్ 16 నుండి 20వ తేదీ వరకు రోజువారి భజన కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించనున్నామని వివరించారు. చివరి రోజు భోగిని శ్యామలాదేవి బోనం ఎత్తనున్నారని స్పష్టం చేశారు. బోనం ఊరేగింపు కు వెళ్లకుండా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చూసి తరించాలని కోరారు. చివరి రోజు కార్యక్రమానికి మహా ప్రసాదం ( అన్నదానం కార్యక్రమం ) నిర్వహించనున్నామని తెలిపారు.