అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Published: Wednesday February 15, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 14, ప్రజాపాలన :
 
జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట, ముల్కల్ల, రాపల్లి గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, (ట్రైనీ కలెక్టర్ పి.గౌతమిలతో కలిసి పరిశీలించారు. గుడిపేట గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టిన అమృత సరోవర్లో చెరువు పూడిక తీత పనులను పరిశీలించి పని స్థలంలో ఉపాధి కూలీలతో పనులు జరుగుతున్న తీరు, కూలీ ధరలు, కొలతలపై వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఉపాధి హామీలో నిర్వహిస్తున్న పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయడంతో పాటు సకాలంలో కూలీ డబ్బులు అందించాలని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్నందున పని స్థలాలలో త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. 
ముల్కల గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న భూమి అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం నర్సరీని సందర్శించి మొక్కల పెరుగుదల, సంరక్షణ పై నిర్వాహకులతో మాట్లాడుతూ నర్సరీలోని ప్రతి మొక్కను సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని, తెలంగాణకు హరితహారం నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలకు సకాలంలో నీటిని అందించాలని, చనిపోయిన మొక్కలను తొలగించి నూతన మొక్కలను నాటి సంరక్షించాలని తెలిపారు. రైతువేదికలో వ్యవసాయ విస్తరణాధికారులు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యవసాయ సాగులో రైతులకు అవసరమైన మెళకువలను అందించాలని తెలిపారు. అనంతరం రాపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి పనులను త్వరిగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని, క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం పల్లెప్రకృతి వనం, బృహత్ పల్లెప్రకృతి వనం, ఐ.కె.పి. ద్వారా చేపట్టిన పొలాలకు ఎరువులు చల్లే స్ప్రే డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించి ఐ.కె.పి. నిధులతో ఏర్పాటు చేసిన బేకరీ షాప్, ఎంబ్రాయిడరీ వర్క్ షాప్ను సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులకు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అబ్దుల్ హై, ఎం.పి.పి. మందపల్లి స్వర్ణలత, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.