విఫణి ధరలకంటే ఎక్కువ లాభాలు రావాలి : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Friday July 30, 2021

వికారాబాద్ బ్యూరో 29 జూలై ప్రజాపాలన : రైతులకు విఫణి ధరలకంటే ఎక్కువ లాభాలు వచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా కంపెనీకి లాభాలతో పాటు రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. గురువారం మోమిన్ పేట పట్టణంలోని రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో కంపెనీ అభివృద్ధిపై డైరెక్టర్ లు, సీసీలు, ఏపీఎం లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు అధిక లాభాలు అర్జీంచే విధంగా పొలంలో విత్తనాలు నాటడం నుండి పంట కొనుగోలు వరకు అన్ని విధాలుగా సహకరించి, పంట సేకరించాలని సూచించారు.  ఈ కంపెనీ పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ప్రభుత్వ పరంగా కొంత సమయం వరకు సహకారంతో పాటు కొన్ని నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.  రేపు ఈ స్థానంలో నేను ఉన్నా లేకున్నా కంపెనీ మనుగడకు అందరు కృషి చేయాలని సూచించారు.  ఏపీఎం లు, సీసీ లు క్షేత్ర స్థాయిలో రైతులతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని కంపెనీలో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పించాలన్నారు.  కంపెనీ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని కంపెనీ ద్వారా జరిగే ప్రయోజనాలు వివరించి ఎక్కువ మంది కంపెనీలో సభ్యులుగా చేర్పించాలన్నారు.  ఏరువాక రైతు సేవా కేంద్రంలో గల వ్యవసాయ పరికరాలను సీజనల్ గా రైతులకు అద్దెకు ఇచ్చి కంపెనీ ఆదాయం పెంచాలన్నారు.  రైతుల ద్వారా కొనుగులు చేసిన పంటలకు  సంబంధించిన చెల్లింపులన్నీ ఆన్ -లైన్ ద్వారా నిర్వహించాలని సూచించారు.  మార్కెట్ డిమాండ్ ప్రకారం ప్రతి రోజు ధరలను ఫిక్స్ చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ డిఓ కృష్ణన్, డీపీఎం శ్రీనివాస్, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి పెంటయ్య, హార్టికల్చర్ అధికారి అబ్దుల్ ఏపీఎం లు, సీసీ లు, కంపెనీ చైర్మన్ లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.