పశువులలో గర్భకోశ వ్యాధుల నియంత్రణ పై వైద్య శిబిరం. ... పశు వైద్య, సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు

Published: Wednesday December 21, 2022
మంచిర్యాల బ్యూరో,   డిసెంబర్ 20, ప్రదాపాలన  :
 
పశువులలో గర్భకోశ వ్యాధుల నియంత్రణ కోసం ప్రత్యేక చికిత్స శిబిరం నిర్వహించడం జరిగిందని పశు వైద్య, సంవర్ధకశాఖ సంయుక్త సంచాలకులు డా. వై. రమేష్ కుమార్   తెలిపారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో నిర్వహించిన చికిత్స శిబిరంలో 35 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేయడంతో పాటు 22 దూడలకు నట్టల మందులు, 42 పశువులకు వివిధ రకాల చికిత్సలు, 13 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా తీసుకోవలసిన చర్యలు, పాల ఉత్పత్తి పెంపొందించేందుకు మార్గాలు, పచ్చి మేత ప్రాముఖ్యత రైతులకు వివరించారు. పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం 75శాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జనవరి-2023 మాసాంతం వరకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాలను ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. గుర్రం మంగ, పశు వైద్య సిబ్బంది డా. వహీం, సంతోష్, మైక్రో ల్యాబ్స్ ప్రతినిధి క్రాంతి, స్కై ఈ.సి. సంస్థ ప్రతినిధి వెంకటేష్, సంబంధిత అధికారులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.