జర్నలిస్టులకు ఇళ్ల, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి. ..కలెక్టరేట్ ఎదుట నిరసన, అదనపు కలెక్టర్ కు వ

Published: Tuesday October 11, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 10 , ప్రజాపాలన :
 
 జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలని  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) జిల్లా అధ్యక్షుడు  తోట్ల మల్లేష్ యాదవ్ జిల్లా ప్రదాన కార్యదర్శి  గోపతి సత్తయ్య                లు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం " డిమాండ్స్ డే "లో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యుడు కామెర వెంకట స్వామి  లతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.  జిల్లా అదనపు కలెక్టర్ మదుసూధన్ నాయక్  కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయలేదని, దీనివల్ల అనేక మంది పేద జర్నలిస్టులు  ఇబ్బంది పడుతున్నారని అన్నారు.  వెంటనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఇస్తున్న బస్ పాస్ లు కూడా పూర్తి స్థాయిలో వర్తించడం లేదని, రైల్వే పాస్, బస్ పాస్ లకు వంద శాతం రాయితీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.  జర్నలిస్టులకు" జర్నలిస్ట్ బంధు పథకం " ప్రవేశ పెట్టాలని కోరారు. రద్దు చేసిన రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికలకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు, ప్రభుత్వం వ్యాపార ప్రకటనల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు , స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు.