అభ్యుదయ వాది తాళ్లూరి భాగ్యమ్మ మృతి కూనంనేని, పలువురి నివాళ..

Published: Friday November 04, 2022
పాలేరు నవంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి
 అభ్యుదయవాది నేలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామానికి చెందిన తాళ్లూరి భాగ్యమ్మ (98) బుధవారం అర్ధరాత్రి మరణించారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయుధ తెలంగాణ పోరాట కాలంలో దళాలకు సహకరించిన భాగ్యమ్మ అప్పటి నుంచి భారతం కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సభ్యురాలిగా ఉన్నారు. ఆమె కుమార్తె ధనమ్మ, రంగయ్య కుమారులైన బాగం హన్మంతరావు, బాగం హేమంతరావు, బాగం కిషన్రావులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు భాగ్యమ్మ విశేష కృషి చేశారు. రెండు దశాబ్దాల క్రితమే ఖమ్మంలో ప్రత్యేకంగా ఒక గదిని అద్దెకు తీసుకుని మనవళ్లకు అండగా ఉండి వారు ఉన్నత విద్యను అభ్యసించేలా చేయడంతో పాటు అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. హన్మంతరావు ఎక్సైజ్ శాఖలో సిఐగా పనిచేస్తుండగా హేమంతరావు సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. యువజన విద్యార్థి ఉద్యమాల్లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. వైద్య విద్యను అభ్యసించిన కిషన్ రావు ప్రస్తుతం మమత ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఐఎంఏ అధ్యక్షులుగా కొనసాగుతున్న కిషన్రావు వైద్య సాయం అందించడంలో ఉత్తముడిగా పేరొందారు. భాగ్యమ్మ కుటుంబం ఆది నుంచి కమ్యూనిస్టు పార్టీకి దన్నుగా నిలిచింది. భాగ్యమ్మ సోదరుడు మేదరమెట్ల రామయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యునిగా పనిచేశారు. భాగ్యమ్మ మృతివార్త తెలిసిన వెంటనే సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా, టిఆర్ఎస్, టిడిపికి చెందిన పలువురు భాగ్యమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు పోటు ప్రసాద్, ఎస్కి సాబీర్ పాషా, సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, నాయకులు అశోక్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బండి రమేష్, టిడిపి నాయకులు తాళ్లూరి జీవన్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ప్రసాద్, ప్రముఖులు ఆర్టిసి వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు పారుపల్లి గోపి, డాక్టర్ వై. ప్రసాద్ తదితరులు నివాళులర్పించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, నాయకులు జమ్ముల జితేందర్రెడ్డి, శింగు నర్సింహారావు, ఎస్ కె జానిమియా, పోటు కళావతి, ఏపూరి లతాదేవి, గోవిందరావు, కర్నాటి భానుప్రసాద్, తాటి వెంకటేశ్వరరావు,
 
నేలకొండపల్లి ఎంపిపి వజ్జా రమ్య, ప్రముఖులు దండా పుల్లయ్య తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ముఠాపురంలో ప్రజల సందర్శన అనంతరం భాగ్యమ్మ మృతదేహాన్ని స్థానిక మమత ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం అందజేశారు. పలువురి సంతాపం :
 
భాగ్యమ్మ మృతివార్త తెలిసిన వెంటనే ఆమె మనుమలు హన్మంతరావు, హేమంతరావు, కిషన్ రావులకు ఫోన్చేసి పలువురు
 
సంతాపాన్ని తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎంఎల్సి పువ్వాడ నాగేశ్వరరావు భాగ్యమ్మ మృతితో ఒక నిబద్దత కలిగిన కార్యకర్తను కోల్పోయామన్నారు. కమ్యూనిస్టు పార్టీ భావజాలంతో కడవరకు నిలిచిన ఆమె తన మనువలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో సఫలీకృతులయ్యారని, నిండు జీవితాన్ని అనుభవించిన ఆమె ధన్యురాలని పువ్వాడ సంతాప -సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కమార్ భాగ్యమ్మ మృతిపట్ల సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిన్నతనం నుంచి భాగ్యమ్మతో తనకు పరిచయం ఉండేదని ఆమె మృతి తనను బాధించిందన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన భాగ్యమ్మ వామపక్ష భావజాలానికి కట్టుబడి కడవరకు నిలిచారని -మంత్రి తెలిపారు.