ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **నేడే పోలింగ్ కేంద్రాల్లో రంగం సిద్ధం **

Published: Monday March 13, 2023

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద నుండి ఎన్నికల సిబ్బంది ఆదివారం పోలింగ్ సామాగ్రిని తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. వారి కోసం ప్రత్యేకంగా సమకూర్చిన వాహనాలలో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరి వెళ్లారు. కలెక్టర్ హరీష్ ఉదయం వేళలోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు చేరుకుని పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. సామగ్రి పంపిణీ లో ఎలాంటి తప్పిదాలకు, గందరగోళానికి తావులేకుండా క్రమ పద్ధతిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంత వాతావరణంలో సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లాలో 31  పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జిల్లాలో 9186 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కును పొందినట్లు వెల్లడించారు. ఇందులో పురుషులు 4870 మంది 4315 మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నట్లు తెలిపారు. కాగా, పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రిని జాగ్రత్తగా సరిచూసుకుని తమ వెంట పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీఓ లు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.