శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published: Saturday February 11, 2023
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున, ఎన్నికల కోడ్ ను జిల్లాలో పకడ్బందీగా అమలుపరచాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికల కోడ్ అమలు పై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి,  జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు  ఫోటోలను వెంటనే ఈ సాయంత్రం వరకు తొలగించాలని ఆదేశించారు.  ముందుగా కార్యాలయాలలో ఉన్న ప్రజాప్రతినిధుల ఫోటోలు వెంటనే తొలగించి స్టోర్ రూమ్ లలో  భద్రపరుచుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు ఆస్తులపై పోస్టర్లో బ్యానర్లు పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా అనుమతి పొంది ఉండాలన్నారు. లేకుంటే వాటిని కూడా తొలగించాలని సూచించారు.  గోడలపై ఉన్న వాల్ పెయింటింగ్స్, పోస్టర్లను కూడా తొలగించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలని అన్నారు.  ఎన్నికల కోడ్ ఉన్నంతవరకు అధికారులు ఎవ్వరు కూడా కలిసి బహిరంగ సభలలో పాల్గొనకూడదని, సమావేశాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించరాదని తెలియజేశారు. తమ తమ పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా ఎలాంటి పనులు చేపట్టకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
*కలెక్టర్ కార్యాలయాన్ని తమ స్వంత ఇంటిలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి :

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కొత్తగా నిర్మించుకున్న కలెక్టర్ కార్యాలయాన్ని ప్రతి ఒక్క అధికారి తమ తమ కార్యాలయాలను సొంత ఇంటి లాగా పరశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.  ప్రతిరోజు మూడుసార్లు టాయిలెట్స్ లను పరిశుభ్రపరుచుటకు స్కావెంజర్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.   తమ ఆఫీస్ సబార్డినేట్లతో కార్యాలయాలలో పరిశుభ్రత పనులను చేపట్టి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  కార్యాలయంలోని పాత ఫర్నిచర్లకు ఉన్న స్టిక్కర్లను తొలగించి కలరింగ్ చేయించాలని ఆదేశించారు.   సిబ్బంది అందరూ సమయపాలన పాటించే విధంగా చూడాలన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కార్యాలయాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కార్యాలయానికి గరజరైన వారి పట్ల ఆరా తీశారు.