కొటాలగూడలో ప్రజాగోస బిజెపి భరోసా

Published: Wednesday February 22, 2023
 మాజీ మంత్రి బిజెపి నాయకులు ఎ.చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన : బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రతి బిజెపి కార్యకర్త కృషి చేయాలని మాజీ మంత్రి బీజేపీ నాయకులు ఎ. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోగల కొటాలగూడ గ్రామంలో సిద్దులుర్ కోటాలగూడ శక్తి కేంద్ర అధ్యక్షుడు నస్కంటి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షుడు మల్లేశం అధ్యక్షతన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ జీవిత రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఎ. చంద్రశేఖర్ మాట్లాడుతూ పదవుల కోసం నేను పనిచేయడం లేదని పార్టీ కొరకు పని చేస్తున్నానని అన్నారు. మా అధిష్టానం సూచించిన సూచనల మేరకు బూతు స్థాయిలో కార్యకర్తలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలయ్యిందని ధ్వజమెత్తారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఆశల పల్లకిలో ఊరేగించిన కేసిఆర్ కు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున కెసిఆర్ భూమి ఇస్తానని మాటతప్పిన మోసగాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే దళితున్ని ముఖ్యమంత్రిగా చేస్తానని బీరాలు పలికిన పిరికిపంద అని ఘాటుగా స్పందించారు. ప్రతి బిజెపి కార్యకర్త బూతు స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పూస గుచ్చినట్లు ప్రజలకు వివరించాలని సూచించారు. నియోజకవర్గ బిజెపి పాలక్ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన మేటి నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. దేశంలో రాష్ట్రంలో అల్ల కల్లోలాలను సృష్టించి దేశ భద్రతకే ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న అసంఘటిత శక్తులను తుదముట్టించాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జూడో పాదయాత్ర నీరుగారిందని విమర్శించారు. భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమం కూడా చతికిల పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవన్ నాయక్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెద్దింటి నవీన్ కుమార్, యువ మోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్, పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి, ధారూర్ మండల బిజెపి ఇన్చార్జ్ జూకంటి మధుసూదన్ రెడ్డి, ప్యాట శంకర్ కొటాలగూడ గ్రామ ప్రజలు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.