ఆదివారం కురుమల సమ్మేళనం * వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ

Published: Saturday November 26, 2022
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజా పాలన : ఆదివారం ఉదయం 10 గంటలకు కురుమల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉంటుందని వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఈ కార్యక్రమానికి జిల్లాలోని కురుమ సోదరులందరూ కుటుంబ సమేతంగా భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమల అస్తిత్వాన్ని కాపాడుకుని హక్కుల సాధనే ద్యేయంగా ముందుకు సాగాలన్నారు. సమాజంలో విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజిక, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా కురుమ కులానికి కల్పించిన హక్కులను సద్వినియోగపరుచుకునే విధంగా కురుమలందరిలో చైతన్యం రావాల్సిన ఆవస్యకత ఉందని చెప్పారు. కురుమ కులాన్ని రాజ్యాంగబద్ధంగా బీసీ - బీలో చేర్చి కురుమల అస్తిత్వాన్ని  భారత ప్రభుత్వం గుర్తించిందని గుర్తు చేశారు. కురుమ సమాజానికి రాయితీలు కాదు రాజ్యాధికారం కావాలని ప్రభుత్వాలపై, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. జనాభాలో 56% ఉన్న బీసీ కులాల్లో బిసిబి కురుమ కులానికి చెందినవారు మెజార్టీ వర్గంగా ఉన్నారు. అయినప్పటికీ అన్ని రంగాల్లో కురుమలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కురుమలు ఇప్పటివరకు ఇతరుల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. తమ కురుమల హక్కుల సాధనలో అందరూ సంఘటితమవుదామని పిలుపునిచ్చారు. రాజకీయంగా అవకాశాలు దక్కించుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వికారాబాద్ లో ఆదివారం 27వ తేదీన తలపెట్టిన కురుమల ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వికారాబాద్ ఎన్ టి ఆర్ చౌరస్తా నుండి సత్యభారతి పంక్షన్ హాలు వరకు ఒగ్గుడోలు కళాకారులతో నృత్యప్రదర్శన ,ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు.