*పండగకు ఊరు వెళ్లే వాళ్ళు జాగ్రత్తలు పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి* -పిల్లలు గాలి

Published: Monday January 16, 2023
చేవెళ్ల జనవరి 14,(ప్రజాపాలన):-

చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల ప్రజలు సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా.. ఐతే అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఏసీపీ రవీందర్‌ రెడ్డి అన్నారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...పండుగకు వేరే ఊర్లకు వెళ్లే వారు తగు జాగ్రతలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని, ఊర్లకు వెళ్లే సందర్భంగా ఇండ్లను విడిచి వెళ్లే సమయంలో ఇంట్లో బంగారం, నగదు చోరీకి గురి కాకుండా చూసుకోవడం, సెలవుల్లో పిల్లలు గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదాలకు గురి కాకుండ తల్లి దండ్రులు జాగ్రత్తలు పాటించాలని పలు సలహాలు సూచనలు చేశారు.
పోలీసుల నిబంధనలు..
ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1.ఊర్లకు వెళ్లే వారు జాగ్రతగా ప్రయాణించి ప్రమాదాలకు గురి కాకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలి.
2. పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. తల్లి దండ్రులు వారి పై నిఘా ఉంచడం మంచిది.
3. చైనా మాంజాలు నిషేధం, వాటి వల్ల పక్షులకు, మనుషులకు ప్రమాదం, వాటిని వాడరాదు.
4. కార్లు, బైక్‌ల మీద పండుగ సెలవులకు వెళ్లే వారు మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరండి.
దొంగతనాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. ఉదయం రద్దీ వేళలో పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హర్‌ ఏక్‌ మాల్‌ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండి.
2. రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించండి.
3. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం,రాత్రి వేళ చోరీలకు పాల్పడటం జరుగుతుంది.
4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదు.
5. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పండి.
6. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొండి.
7. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
8. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు అపరిచితులు సమాచారం
పేరుతో వస్తే నమ్మకండి.
9. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకపోవడమే మంచిది (లేదా) బ్యాంక్‌ లాకర్లో పెట్టుకోవడం మంచిది.
10. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించండి.
11. పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి.
12. ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్‌ ఫోన్‌ నెంబర్‌ (లేదా) సెల్‌ ఫోన్‌ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోగలరు.
13. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. డయల్‌ 100 లేదా పోలీస్ చేవెళ్ల ఇన్స్​పెక్టర్‌ +91 94406 27356, శంకర్పల్లి ఇన్స్​పెక్టర్‌+91 94906 17954, షాబాద్‌ ఇన్స్​పెక్టర్‌+91 94406 27257 నెంబర్లను సంప్రదించి సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీస్ యంత్రాంగం తనిఖీలు చేపడుతుందని, జూదం, కోళ్ల పందాలు అడే వారిపై టాస్క్ ఫోర్స్​‍ బృందాలుతో నిఘా ఉంచామని ప్రజలు ఎవరూ కుడా జూదం, కోడి పందాల వైపు వెళ్లద్దని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.