విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించుకోవాలి

Published: Wednesday February 23, 2022
శ్రీరాంపూర్ జీఎం యం. సురేష్
నస్పూర్, ఫిబ్రవరి 22, ప్రజాపాలన ప్రతినిధి: విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని శ్రీరాంపూర్ జీఎం యం. సురేష్ అన్నారు. మంగళవారం స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు లార్డ్ బేడెస్ పావెల్ జన్మదినం సిసిసి సింగరేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనాన్ని స్వీకరించి, సర్వమత ప్రార్థన చేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లార్డ్ బేడెస్ పావెల్ సేవలను కొనియాడారు. విద్యార్థులందరు క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని, దేశభక్తిని అలవరచుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈరోజును ప్రపంచ ఆలోచన దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది గైడ్స్ కి యూనిఫామ్ లను జీఎం చేతులమీదుగా అందజేశారు. గవర్నర్ అవార్డుకు ఎంపిక అయిన స్కౌట్స్ అండ్ గైడ్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్), సింగరేణి ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ పి.గోవిందరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సీనియర్ పీఓ పి.కాంతారావు, ఉపాధ్యాయులు రాధాకృష్ణ మూర్తి, పాలిటెక్నిక్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ మధుబాబు, గైడ్స్ కెప్టెన్ హేమలత, స్కౌట్స్ మాస్టర్ ఎస్కే సాజిద్, తదితరులు పాల్గొన్నారు.