ప్రాధాన్యత క్రమంలో భూసమస్యలను పరిష్కరించాలి

Published: Tuesday April 19, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజాపాలన : ప్రజావాణికి వచ్చిన భూసమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 120 భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొంత మందికి ధరణి వెబ్-సైట్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక కార్యాలయాల చుట్టు తమ పనుల కొసం తిరుగుతున్నారని, అలాంటి వారికి మండల స్థాయిలో అధికారులు సహకరించాలని  సూచించారు. గత మూడు నెలలుగా ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలకు వెంటనే స్పందించి పరిష్కరించడం జరుగుతుందని, అంతేగాక మండల, డివిజన్ స్థాయిలో కూడా ప్రజలు, ప్రజా ప్రతినిధులతో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతున్నందున, జిల్లా స్థాయిలో ప్రజావాణికి ప్రజలు తగ్గుముఖం పట్టరాని కలెక్టర్ తెలిపారు. ఈ వారం కూడా మండలాల వారిగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులైన సర్పంచ్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీ లను పిలుపించి సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. వికారాబాద్, మోమిన్ పేట, పూడూర్, నవాబుపేట మండలాల్లో దాదాపు భూసమస్యలు పరిష్కరించడం జరిగిందని, భూతగాదాలు, ఇతర సమస్యాత్మక సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇంకను అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులకు పరిష్కరించేందుకు తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఆర్డిఓ అశోక్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.