ముంపు బాధితుల సంరక్షణ కొరకు పూర్తి స్థాయి చర్యలు జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Thursday July 14, 2022
మంచిర్యాల బ్యూరో, జూలై 13, ప్రజాపాలన  :
 
వరద పరిస్థితుల కారణంగా ముంపు బాధితుల సంరక్షణ కొరకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రె, ఇన్చార్జ్ డి.సి.పి. అఖిల్ మహాజన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావుతో కలిసి జిల్లా కేంద్రంలోని కాలేజ్లోడ్లోని మాతా, శిశు కేంద్రం, రాంనగర్, ఎన్.టి.ఆర్. నగర్ తదితర ముంపు ప్రాంతాలతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిమట్టాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 5 రోజులుగా ఎడతెరపి లేకుండా జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాలతో కురుస్తున్న వర్షాల వలన నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగుతు  న్నాయని, జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలోకి చేరుతున్న వరద నీటి స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఎల్లంపల్లి జలాశయం నుండి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పని చేస్తుందని, వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతా, శిశు కేంద్రం నుండి బాలింతలు, మహిళలను జిల్లా కేంద్రానికి ముందస్తు చర్యగా తరలించడం జరిగిందని తెలిపారు. గర్భిణులకు దగ్గరలో ప్రసవ తేది ఉన్న వారిని సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించామని, నివాసాలు ముంపుకు గురైన దాదాపు 1 వేయి 700 మందికి పైగా నిరాశ్రయుల సహాయం కోసం దాదాపు 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆహారం, త్రాగునీరు కనీస అవసరాలు అందించడం జరుగుతుందని, 275 కంటే ఎక్కువగా ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. వరద పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని తెలిపారు. మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులలో వరదనీరు అధిక మొత్తంలో వచ్చి చేరడంతో దిగువ ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని, ప్రభుత్వం యంత్రాంగం ద్వారా అన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  అత్యవసర సేవల నిమిత్తం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, సేవల నిమిత్తం 08736-250500, 250501, 250502, 250504 నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.