తైబజారు డబ్బులను కాజేస్తున్నా దళారీలు పట్టించుకోని పాలకవర్గం బిజెపి నాయకులు గోగు సురేందర

Published: Wednesday December 07, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో  తై బజార్ వేలం దక్కించుకున్న, కాంట్రాక్టర్లు, బకాయిలు చెల్లించకుండా మున్సిపాలిటీ నష్టం కలగజేస్తున్నారని, వెంటనే విచారణ జరిపించి మున్సిపాలిటీకి రావలసిన ఆదాయాన్ని వసూలు చేయాలని బిజెపి నాయకులు గోగు సురేందర్ అన్నారు.
బుధవారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు విలేఖరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు,
బెల్లంపల్లి మున్సిపాలిటీలో 2019 తెలంగాణ మున్సిపల్ ఆక్ట్ కు విరుద్ధంగా గత నాలుగు సంవత్సరాలుగా, తైబజార్ టెండర్  దక్కించుకున్న కాంట్రాక్టర్, మున్సిపాలిటీకి బకాయిలు చెల్లించడం లేదని, కొందరు వ్యక్తులు (అధికార పార్టీ కి చెందినవారు) ఒక ముఠాగా ఏర్పడి తైబజార్ వేలంలో ఇతరులను పాల్గొనకుండా చేస్తూ, మున్సిపాలిటీ అధికారులకు ముడుపులిచ్చి టెండర్లు దక్కించుకుంటున్నారని, టెండర్ నియమాలకు విరుద్ధంగా ఒక ముస్లిం సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తి, వేరే వారి పేర్ల మీద టెండర్లు వేసి దక్కించుకుంటూ,  మున్సిపాలిటీ కి విడతలవారీగా చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని అన్నారు.
ఎమ్మెల్యే  అనుచరులు మున్సిపాలిటీకి ఉన్న తై బజార్ బకాయిలను వెంటనే చెల్లించి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
గత ఎమ్మెల్యేల కాలంలో ఎవరు కూడా ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగపరచలేదనీ, ప్రస్తుత ఎమ్మెల్యే అసమర్ధత వల్ల పట్టణం అభివృద్ధి చెందడం లేదని, పట్టణ ప్రజలు అభివృద్ధిని చూసి నవ్వుకునే పరిస్థితి తెచ్చుకున్నాడని పరోక్షంగా ఎమ్మెల్యే పనితీరుపై విమర్శించారు. 
బెల్లంపల్లి పట్టణానికి రోజుకు రెండు నుంచి మూడు  వేల మంది వ్యాపారులు వివిధ మండలాలనుండి,వచ్చి  రోజువారిగా కూరగాయలు అమ్ము కుంటారని, వారి వద్దనుండి రోజుకు 20 నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బులను సహితం జేబులో వేసుకొని మున్సిపాలిటీకి చెందకుండా చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ బెల్లంపల్లి మున్సిపల్ తయి బజారు వేలం పాటల పై, వచ్చే ఆదాయాలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.