ముదిరాజులను బీసీ ఏ గ్రూపులో చేరిస్తే బిసీ 'ఎ' గ్రూపులో ఉన్న 56 కుల కులాలకు తీవ్ర అన్యాయం ప్రభు

Published: Monday November 21, 2022
బి సి ఏ గ్రూప్ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో బి సి సాధికారత భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ బి సి ఏ గ్రూపులోని వారు సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా ముదిరాజులకంటే చాలా వెనుకబడి ఉన్నారన్నారు. వీరిలో కొన్ని కులాల వారు కుల వృత్తుల మీద ఆధారపడి బ్రతికేవారున్నారని.నేడు వృత్తులు కనుమరుగవుతున్న క్రమంలో వలస కూలీలుగా,స్త్రీలు ఇంటి పని (పాచి) వారుగా జీవనం వెళ్లబుచ్చుతున్నారని తెలిపారు. అంతేకాక అనేక సంచార కులాలు బిసీ 'ఎ' గ్రూపులో ఉన్నారు. వీరు సంస్కృతిక కులాలుగా ఉంటూ బిక్షాటన చేస్తూ జీవించుచున్నారు. ఉదా: పిచ్చకుంట్ల (వంశధార), బుడబుక్కల, కాటికాపర, బాలసంతు, బహురూపుల, దొమ్మెర, పాముల,పంబాల, పెద్దమ్మలవాల్లు,యల్లమ్మల వాళ్లు, మొండి, వడ్డెర, పూసలి కులాల వారు ఉన్నారు. వీరుకాక మరికొన్ని కులాలకు చెందిన ఉప కులాలు కూడా ఉన్నవి.56 బి.సీ 'ఎ' గ్రూపు కులాల్లో కనీసం స్థానిక సంస్థలలో కూడా పోటీ చేయలేని కులాలు అనేకం  ఉన్నవి. విద్యాపరంగా 5వ తరగతి కన్న ఎక్కువ చదవని సంచార జాతులు ఉన్నవి.వీరు సామెతల కులాలుగా,తిట్ల కులాలుగా ఉండి నేటి సమాజంలో ఆత్మగౌరవం కూడా కోల్పోయి బ్రతుకులు ఈడ్చుచున్నారు. స్థిర నివాసం లేక,జనాభా లెక్కల్లో కూడా లేకుండా, ఆధార్‌, రేషన్‌, ఓటరు కార్డు కూడ లేకుండా ఉన్నారు.70 సంవత్సరముల స్వతంత్య్ర భారతదేశంలో కనీసం ఓటుహక్కు కూడా వినియోగించుకోలేని దీనస్థితిలో ఈ సంచార బిక్షాటన కులాలు బిసీ 'ఎ' గ్రూపులో ఉన్నవి. వీరు ప్రభుత్వం తమ కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలుసుకొని వినియోగించుకునే స్థితిలో లేరు. కాని ఇట్టి కులాల సరసన వీరికన్న అభివృద్ధి చెందిన ముదిరాజులను బి.సీ. 'ఎ' గ్రూపులో చేర్చడం వల్ల ఈ కులాల వారు మరింతగా అణగదొక్కబడి ప్రభుత్వం తమకు అందించే కొద్దిపాటి రిజర్వేషన్లను కాని, సంక్షేమ పథకాలను కాని వినియోగించుకోలేని ధీనస్థితికి నెట్ట బడతారు. బి.సీ కులాలలో అభివృద్ధిలో ముందు వరుసులో ఉన్న ముదిరాజులను బి.సీ 'ఎ' గ్రూపులో చేర్చడం అంటే బలమైన కోడెగిత్తకు బలహీనమైన కోడెగిత్తకు ఒకే గాటిన మేత (దాన) పెట్టినట్లు ఉంటుందన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో అనంత రామన్‌ కమీషన్‌ బి.సీల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని ఎ, బి, సి, డిలు గా వర్గీకరణ చేయవలసిందిగా ప్రతిపాదించినదని పేర్కొన్నారు. 1970వ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం ఎ, బి, సి, డి వర్గీకరణ చేసినది. ఈ వర్గీకరణ సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాలు మరియు అట్టి కులాల జనాభా ప్రాతిపదిక ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను, సంచార కులాలను బి.సీ. 'ఎ' లో చేర్చి వారికి 7% రిజర్వేషన్లు, బి.సీ. 'బి'లో చేతి వృత్తిదారులను చేర్చి వారికి 10% రిజర్వేషన్లు, బి.సీ. 'సి' గ్రూపు వారికి 1% మరియు బి.సీ. 'డి' లో వ్యవసాయం, వ్యాపారం ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని 31 కులాలను చేర్చి వారికి 7% రిజర్వేషను కల్పించినారు. ఈ మధ్యకాలంలో ముస్లీం మైనార్టీల్లో కూడా వారి వెనుకబాటు తనం ఆధారంగా గుర్తించి వారికి 4% రిజర్వేషన్లు ఇచ్చి బి.సీ. 'ఇ' గ్రూపులో చేర్చడం జరిగింది. ఇంత పద్దతి ప్రకారం ఎ, బి, సి, డి, వర్గీకరణ జరిగితే ఉన్నట్లుండి ముదిరాజులను ఒకేసారి అమాంతం పై నుండి కిందికి 'డి' నుండి 'ఎ' గ్రూపులోకి మార్చే ప్రయత్నం జరుగుతున్నది. బి.సీ. 'ఎ' గ్రూపు కులాలు వెనుకబడి ఉండి తమకు కెటాయించిన రిజర్వేషన్‌ను ఉపయోగించుకోలేక పోవుచున్నవన్న విషయాన్ని గ్రహించిన కొన్ని కులాలు ఏదో ఒక వంక చూపి  బి.సీ. 'ఎ' గ్రూపులో చేర్చాలని తమ పలుకుబడిని ఉపయోగించి చేయుచున్న కుట్రయే ఈ చర్య అన్నారు. ఇదీ కనుక అమలైతే చిన్న చేపను పెద్ద చేప మింగినట్లే ఉంటుంది. కావున ప్రభుత్వం ముదిరాజులను బి.సీ.'డి' గ్రూపు నుండి 'ఎ' గ్రూపులోకి మార్చే ఆలోచనను మానుకోవాలని యంబిసీ సంఘం డిమాండు చేయుచున్నదన్నారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించాలని బి.సీ. 'ఎ' గ్రూపు కులాలు ఏకమై ఐక్యంగా నిలబడి వ్యతిరేకించకుంటే రాబోయే రోజుల్లో మరికొన్ని కులాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం బి.సీ. 'ఎ' గ్రూపులో చేర్చగలదన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం బి సి ఏ గ్రూప్ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మానస గణేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థపకులు ఎ ఎల్ మల్లయ్య, ఓయూ జె ఏ సి అధ్యక్షుడు డా.ఎల్చల  దత్తాత్రేయ, బోయ గోపి, అబ్బు లింగం, నరహరి, శ్రీనివాస్, పోశెట్టి, పాండు, శేఖర్, ఎల్లేష్, బాల నర్సింహా, స్వామి, సంపత్, రవి యాదగిరి విజయ్ లక్ష్మణ్ కృష్ణ  రఘుపతి వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 
 తీర్మానాలు
1. బిసి ఎ గ్రూపులోకి ఎవరిని చేర్చాకూడదని అన్ని పార్టీలకు రాజకీయ ప్రతినిధులకు, ప్రభుత్వనికి వినతి పత్రాల సమర్పించడం
2. సానుకూలంగా స్పందించని యెడల నిరసన ప్రదర్శనలు చేయడం