పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల బ

Published: Wednesday March 29, 2023

విద్యార్థులు పట్టుదలతో చదివి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని  జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రతిభా ప్రోత్సాహక పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన అభినందన, ప్రోత్సాహక కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో రాణించేలా విద్యార్థులకు సన్నద్ధం చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ, జిల్లా పరిషత్, కస్తూరిభా, ఆదర్శ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష నిర్వహించడం అభినందనీయమని అన్నారు.  అత్యుత్తమ ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులకు ఉచిత విద్య అందిచేందుకు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ వారు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష ద్వారా అత్యుత్తమ ప్రదర్శన చూపిన 10 మంది విద్యార్థులకు ప్రతిభా ప్రోత్సాహక పురస్కారములు అందజేయడం జరిగిందని, జిల్లా స్థాయిలో మొదటి 3 స్థానాలలో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యను పూర్తి ఉచితంగా చదివించడానికి అవినాష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్-హైదరాబాదు వారు ముందుకు వచ్చారని, వారి సంబంధిత సంస్థలో అడ్మిషన్ పూర్తి ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఇదే స్ఫూర్తితో పట్టుదలతో చదివి విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు, అవినాష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ హెడ్ డా. సాయికుమార్, డైరెక్టర్ సంతోష్, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి భీంరావు, సహాయ కార్యదర్శి దేవసాని కుమారస్వామి, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.