ఇజ్రాచిట్టెంపల్లిలోని 4వ వార్డులో నీటి సమస్యను పరిష్కరించాలి

Published: Saturday December 03, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 02 డిసెంబర్ ప్రజా పాలన : ఇజ్రాచిట్టెంపల్లిలోని 4వ వార్డ్ లో నీటి సమస్యను పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శుక్రవారం మోమిన్ పేట్ మండల పరిధిలోని ఇజ్రాచిట్టెంపల్లి, కిషన్ నాయక్ తండా, పల్లెగుట్ట తండాలలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కాశీరాంతో కలిసి మూడు తండాలలో ప్రతి గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెగుట్ట తండాలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వంగిన స్థంభాలు తీసి కొత్త స్థంబాలు ఏర్పాటు చేయాలన్నారు. పల్లెగుట్ట తండాలో రోడ్లపై మురుగు నీరు పారకుండా సైడ్ డ్రైన్ నుండి వెళ్లేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కిషన్ నాయక్ తండాలో మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి త్వరగా మిషన్ భగీరథ నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇజ్రాచిట్టెంపల్లి గ్రామానికి ప్రతి బుధవారం పశువుల డాక్టర్ గ్రామ పంచాయతీ దగ్గర అందుబాటులో ఉండాలని పశు వైద్య శాఖ అధికారులకు సూచించారు. ఇజ్రా చిట్టెంపల్లి గ్రామ పంచాయతీలో అవసరమైన చోట నూతన విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని వివరించారు. పాత విద్యుత్ తీగలు మళ్ళీ మళ్ళీ తెగిపోతున్నాయని తండావాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన విద్యుత్ తీగలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకును నెలలో 1,11,21వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. గ్రామంలో పాడు బడ్డ ఇండ్లు, పిచ్చిమొక్కలు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ ప్రజలకు నీరు సరిపడేలా అందించాలని తెలిపారు. నల్లాలకు చెర్రలు తీయకుండా అవగాహన కల్పించాలని వెల్లడించారు. పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలన్నారు. ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా మిషన్ భగీరథ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మూడు తండాలలో అవసరమైన చోట రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామని భరోసా ఇచ్చారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలో ఉంచాలన్నారు. గ్రామ ప్రజలు మెచ్చుకునేలా పని చేస్తున్న సర్పంచ్ కాశీరామ్ ను ఎమ్మెల్యే ఆనంద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.