మేకవనంపల్లిలో బీరప్ప జాతర ఉత్సవాలు

Published: Tuesday February 22, 2022
సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన : గ్రామానికి ఏ ఆరిష్టం ఆపద రాకుండా చల్లగా చూడాలని గ్రామ దేవతలను ప్రజలు భక్తిప్రపత్తులతో కొలుస్తారని మేకవనంపల్లి సర్పంచ్ పట్లోళ్ళ శశిధర్ రెడ్డి అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల పరిధిలోని మేకవనంపల్లి గ్రామంలో బీరప్ప జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పాడిపంటలు, పశుసంపద వృద్ధి చెందేందుకు గ్రామ దేవతల ఆశీస్సులు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించేలా రక్షణ కవచంగా ఉండి గ్రామ దేవతలు కాపాడుతారని ప్రజల ప్రగాఢ విశ్వాసమని స్పష్టం చేశారు. గ్రామ దేవతలను ప్రసన్నం చేసేందుకు బోనాలు తీసి ప్రత్యేక నైవేద్యం అర్పించి మొక్కులు చెల్లింపు చేసుకుంటారని వివరించారు. పలు చీడపీడల నుండి ప్రజలను, పశువులను రక్షించి కరుణాకటాక్షలు ప్రసరింపజేస్తారని ప్రజల తరతరాల విశ్వాసం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బి.విజయ్ కుమార్, మేకవనంపల్లి పిఏసిఎస్ చైర్మన్ పట్లోళ్ళ అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, ఎంపిటిసి గోవర్ధన్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షుడు కాస్లవాద మల్లేశం, కారోబార్ కుమ్మరి శ్రీనివాస్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.