కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

Published: Tuesday February 15, 2022
తెలుగుదేశం పార్టీ నాయకుల డిమాండ్
బెల్లంపల్లి, ఫిబ్రవరి 14, ప్రజాపాలన ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బెల్లంపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నాడు స్థానిక బాబుక్యాంపు ప్రెస్ కబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనీ రామ్ సింగ్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, గతంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, ప్రభుత్వాలు ఏనాడు రాజ్యాంగం జోలికి పోలేదని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే స్వేచ్ఛాయుత వాతావరణంలో కుల, మత బేధాలు లేకుండా శాంతియుతంగా జీవిస్తున్నారని అన్నాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే రిజర్వేషన్లు అమలవుతూ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే లక్షలాదిమంది బడుగు, బలహీన, దళితులకు, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ కాదని తన మాటే నడవాలని తను ఏది చేసినా సక్రమంగానే ఉంటుందనే ఆలోచనతో కెసిఆర్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు., రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దేశ ప్రజలందరికీ కేసీఆర్  బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మని రామ్ సింగ్, తాళ్ళపెళ్ళి రాజేశ్వర్ లతో పాటు సీనియర్ నాయకులు రాజ్ కుమార్ పాండే, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.