సి ఐ టి యు గోడపత్రిక ఆవిష్కరణ

Published: Friday October 08, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : కనీస వేతనాల జీవోల సాధనకై అక్టోబర్ 8న జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయండి -డి.కిషన్ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అక్టోబర్ 8న జరగనున్న రాష్ట్ర వ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో మున్సిపల్ కార్మికులతో "గోడ పత్రిక"ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.కిషన్ మాట్లాడుతూ 73 షెడ్యూల్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు మరియు మున్సిపల్, గ్రామపంచాయతీ ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాల జీవోలను గత 11 సంవత్సరాలుగా సవరించకుండా కాలయాపన చేస్తున్నారనీ, ముఖ్యంగా ఇటీవల విడుదలైన 5 జీవోలను గెజిట్ చేయకుండా పరిశ్రమల యజమానులు, కాంట్రాక్టర్ల ఒత్తిడికి లొంగి గెజిట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే విడుదల చేసిన జీవోలను గెజిట్ చేయాలనీ మరియు గత 11 సంవత్సరాలుగా సవరణ చేయని జీవోలను వెంటనే సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ లను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిబంధనలు చేర్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్నారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం జూన్ నెలలో 30శాతం వేతనాలు పెంచి జీఓ ఎం.ఎస్ నెం 60ని విడుదల చేసినప్పటికీ ఆ జీవోను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అక్టోబర్ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ఎస్.నగేష్ నాయకులు పి.మురళి, రంగయ్య, రాములు, గోపాల్, ముత్యాలు, యాదయ్య, స్వరూప, పారిజాత, యాదమ్మ, అరుణమ్మ, మైసమ్మ, తదితరులు పాల్గొన్నారు.