నలిగి పోతున్న టి ఆర్ ఎస్ కార్యకర్తలు

Published: Wednesday July 07, 2021
డియర్ కెసిఆర్ గారు!
ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒకాయన ఒక పార్టీలో పోటీ చేస్తాడు గెలుస్తాడు. అతను టిఆర్ఎస్ లో కలుస్తాడు. అక్కడ మరొకాయన టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తాడు ఓడిపోతాడు. గెలిచిన ఆయన టిఆర్ఎస్ లో చేరినాడు. అప్పుడు ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కోసం పనిచేసిన కేడర్ ఏమైపోవాలి? నిన్నటిదాకా రకరకాల విమర్శలు చేసిన కార్యకర్తలు, తలలు పగలకున్న వాల్లు కొత్తగా చేరిన వేరే పార్టీ తరఫున గెలిచి టిఆర్ ఎస్ లో కలిసి నపుడు అతనితో కలవడానికి మొహం చెల్లదు. ఆ ఎమ్మెల్లే పార్టీకి బాస్ కాబట్టి కెసిఆర్ దండాలు పెడతాడు కాని స్థానిక టిఆర్ ఎస్ కేడర్ ను అలా చూడడు. ఎందుకంటే ఆయనను గెలిపించిన కేడర్ వేరే వుంటుంది. వారికి ప్రాధాన్యత ఇస్తాడు. టిఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన నాయకుడిని పార్టీ ఏదో స్థాయిలో సర్దుబాటు చేస్తుంది. కాని స్థానిక టిఆర్ ఎస్ కార్యకర్తలు తమ సొంత పార్టీలో రెండో శ్రేణి పౌరులుగా వివక్షకు, అణిచి వేతకు శీతకన్నుకు గురవుతారు. వాళ్ళ ప్రయోజనాలు పరపతి ఏం కావాలి? వారి ప్యోజనాలు ఎవరు తీరుస్తారు? ఏమంటే వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయనకు వేరే కేడర్ ఉంటుంది కదా! మరి చిన్న చిన్న పదవులు టిక్కెట్లు, కాంట్రాక్టులు, ఎంపీ ఫండ్స్, ఎమ్మెల్లే ఫండ్స్, ప్రభుత్వ నిధుల కెటాయింపులలో ప్రాధాన్యతలు ఎవరికి ఎలా ఇస్తారు? అక్కడ అభ్యర్థి ఓడిపోయాడు. ఓడిపోయినా టిఆర్ఎస్ కేడర్ ఉంటుంది. ఆ కేడర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోతే టిఆర్ఎస్ మొత్తం  శిథిలమై పోతుంది కదా! వాళ్ల బతుకు లు ఏం కావాలి? కొత్తగా చేరిన నాయకుడి కి చెంచాగిరి కొట్టినా నమ్మడు. కొత్తగా చేరిన ఆయన తన అనుచరులకు ఇస్తాడు. అలా ఇవ్వక పోతే ఆయనకు సొంత కేడర్ మిగలదు. అందువల్ల వారిని కాపాడుకుంటాడు. మరి కొత్తగా చేరిన ఆయన తన వారికి ఇస్తే మొదటి నుంచి టిఆర్ఎస్ లో పనిచేసిన కేడర్కు ఏమి దక్కుతుంది? వివిధ పదవులు, హోదాలు, పార్టీ ప్రమోషన్లు ఇవ్వడంలో వారు వెనక్కి నెట్టి వేయబడుతారు. అణిచివేతకు, అవమానాలకు, వివక్షకు గురవుతారు. వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్లేకు, అంతదాక పరస్పరం కొట్లాడుకున్న అతని కేడర్ కు వాళ్ళు ఎవరి కి ఎలా ముఖం చూపించాలి? ముందే గ్రామాలలో ఫాక్షన్ గ్రూపులు ఉంటాయి. ఒకే పార్టీలో కొత్త పార్టీ పాత పార్టీ మనుషులు కలిసి ఎలా ఉంటారు? ఎలా కలిసి పని చేస్తారు? ఆ కొట్లాటలు ఎలా పరిష్కరించినా టిఆర్ ఎస్ కేడర్ కు సరైన న్యాయం జరగదు. చిన్న చిన్న పదవులైనా ప్రతిష్టాత్మకంగా మారుతాయి. ఆ పదవులను ఎలా పంచుకుంటారు? ఎలా పరిష్కరించుకుంటారు? పాత (కేడర్) వాళ్ల అభివృద్ధి జీవితాలు నాశనం పదహారు పాల్లేనా? ఈ కేడర్ అంతా బీసీ ఎస్సీ ఎస్టీ లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విలువలతో విశ్వాసంతో నాయకులతో ఉండేది వీరే. అగ్రకులాల వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వేరే చూసుకునే అవకాశం ఉంది. నష్టపోయేది అంతా బి సి ఎస్సీ ఎస్ టి రెండో శ్రేణి నాయకత్వమే. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని ప్రమోట్ చేసుకోవడం ఎలా? నేడు ఎమ్మెల్యేను సింగిల్ విండో హోల్ అండ్ సోల్ నాయకత్వం గా అన్ని వారి ద్వారానే జరగాలనే పద్ధతి కొనసాగుతున్నది. వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంటుంది. కానీ ఆచరణ వేరుగా ఉంటుంది. భిన్న ఫలితాలు ఇస్తాయి. ప్రతి ఊర్లో ప్రతి దశలో కనీసం ముగ్గురు కార్యకర్తలు ప్రతి విషయంలో పోటీపడతారు. మూడు గ్రూపులు అనివార్యం. కులాలు, ఆశలు నిరీక్షణ వివక్షలు మూడు గ్రూపులను అనివార్యం చేస్తాయి ఎమ్మెల్యే ఏక గవాక్షం వల్ల తన గ్రూపుకు ప్రాధాన్యత ఇస్తాడు. మిగతా రెండు గ్రూపులు అణిచివేయబడతాయి. నిరాదరణకు గురి అవుతాయి. వెనక్కి నెట్టి వేయబడతాయి. క్రమంగా వారు ఇతర పార్టీల వైపు వెళ్లిపోతుంటారు. అక్కడ  ఇతర పార్టీలలో వారి సీనియారిటీ లెక్కకు రాదు. చిత్తశుద్ధితో టిఆర్ ఎస్ పార్టీని నమ్ముకున్న వీరంతా ఏమై పోవాలి? వారి ప్రమోషన్లు, ఎదుగుదల, అవకాశాలు, భవిష్యత్తు, అభివృద్ధి, మొత్తం దెబ్బతింటున్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 - 70 నియోజకవర్గాల్లో కొనసాగుతున్నది. ఈ వైరుధ్యాన్ని టిఆర్ఎస్ పాత కేడర్ను కాపాడుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ రావడానికి ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా! అవి వివరించండి. రాబోయే ఎన్నికల్లో ఇది సీరియస్ సమస్య. నియోజకవర్గాల్లో ఇప్పటికే ఇది ప్రమాదకర స్థాయికి చేరుకొన్నది దీనికి తోడు నిరుద్యోగ సమస్య. ఎమ్మెల్యే ఇష్టారాజ్యం కొనసాగుతున్నది. వీరు అగ్రకుల ఎమ్మెల్యేలని ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారని వేరే చెప్పనవసరం లేదు. బాధపడుతున్నది దెబ్బతింటున్నది నిజాయితీపరులైన విలువలు కలిగిన నిబద్ధత కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ లే అని మరిచిపోరాదు. దీన్ని పరిష్కరించకపోతే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సంస్కృతి వలె ఆయా గ్రూపులు, ఓడిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే గ్రూప్ లు, ఆయా కులాల గ్రూపులు పరస్పరం ఒకరినొకరు ఓడించే కృషి చేస్తారు. దీనిని సామరస్యంగా ఎలా పరిష్కరించు పాటు కోవాలి? సబితా ఇంద్రారెడ్డి వంటి వారు, స్పీకర్ మధుసూదనా చారిమీద  గెలిచిన వారు... వారి నాయకత్వం కోసం టిఆర్ఎస్ కేడర్ను నాయకత్వాన్ని తొక్కేసి తమ కేడర్ను పెంచుకుంటారు బలపరచు తీసుకుంటారు. ఇతర పార్టీల నుంచివచ్చి చేరిన వాళ్ళతో ప్రతి చోట ఈ సమస్య ఉత్పన్నం అవుతున్నది. ఇది చాప కింద నీరులా కనపడకుండా విస్తరిస్తున్నది. ఇలా చూసినపుడు జంప్ జిలానీలు, ఆయారాం గయారాంలు పార్టీకి వాపే తప్ప బలుపు కాదు. తన సొంత కేడర్ ను పోగొట్టుకుంటేఅక్కడ పార్టీ మిగలదు. తమ సీనియారిటీ ప్రాధాన్యతలు ప్రాధాన్యతలు, ప్రమోషన్లు అందినుపుడే వారిలో ఉత్సాహం ఉంటుంది. ఇలాంటి వారందరిని సమన్య పరుచుకొని సమతుల్యత సాధించడానికి అధిష్టానం తరఫున ప్రత్యేక కృషి జరగాలి. స్పీకర్ మధు సూదనాచారి వంటి వారి కేడర్ ను కాపాడుకోవడానికి, బలోలోపేతం చేయడానికి అధిష్టానం ఇంచార్జీలను నియమించాలి. ఇలా సమర్థులైన ఎందరో ఏ పని అప్పగించక గత రెండున్నరేళ్లుగా ఐడిల్ గా ఉండి పోతున్నారు. వారికి పని కల్పించాలి. కేడర్ కు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు శిక్షణా తరగులు నిర్వహించాలి. నాయకత్వ సామర్థ్యాలు పెంచాలి. లేని ఎడల పార్టీ గిడస బారిపోతుంది. ఆయారాం గయారాంలతో పార్టీ కప్పల తక్కెడగా మారుతుంది. టిఆర్ ఎస్ నాయకత్వం తమ స్వంత కేడర్ ను కాపాడుకోవాలి. ఎదిగించుకోవాలి. లేని ఎడల గాలికి కొట్టు కొచ్చిన నాయకులుగా మిగిలి పోతారు. కెసిఆర్ గారూ! టిడీపీలో, తెలంగాణ రాషట్ర ఉద్యమంలో ఇచ్చిన కేడర్ శిక్షణా తరగతులు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ అభివృద్ది అనుభవాలు నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వాన్ని అభివృద్ది పరిచి టిఆర్ ఎస్ పార్టీని కొత్త జవ సత్వాలతో కొత్త స్వరూప స్వభావాలతో బలోపేతం చేయడం అవసరం. వేరే పార్టీలో గెలిచి వచ్చిన వారి సేవలు పొరుగు సేవల వంటివి. వారు తమ సేవ ప్రయోజనాలే చూసుకుంటారు. ఇప్పటికే టిఆర్ ఎస్ పార్టీ తెలంగాణ టీడీపీ పార్టీ మారిపోయింది తప్ప దాని ఉద్యమ స్వభావం కోల్పోయిచాలా కాలమే అయింది. మీరే స్వయంగా చిఆర్ ఎస్ ఇక ఫక్తు రాజకీయ పార్టీ యే. అన్ని పార్టీలవంటిదే అని ఎందుకన్నారో గాని ప్రజలే ఇంకా ఉద్యమ పార్టీ అని, ఉద్యమ నాయకుడని భ్రమల్లో, విశ్వాసంలో బతుకుతున్నారు. కలగూర గంపగా మారిన పార్టీ నిర్మాణం, లేదా చతికిల పడిన పార్టీ నిర్మాణం నూతన జవ సత్వాలతో ఎదగడం అవసరం. ఇతర పార్టీలు బలపడే క్రమం గమనించి ముందుకు ఉరకడం అవసరం. నలిగి పోతున్న టీఆర్ ఎస్ కార్యకర్తలకు ఆశా దీపమై వెలుగొందడం అవసరం.