భవిష్యత్తులో విద్యార్థులు మరెన్నో మంచి కథలు రాయాలి: డీఈవో సోమశేఖర శర్మ

Published: Wednesday February 15, 2023
బోనకల్ , ఫిబ్రవరి 14 ప్రజా పాలన ప్రతినిధి:
విద్యార్థులు సహజంగానే కొన్ని నైపుణ్యాలను కలిగి ఉంటారని, వారిలోనే ఆ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే ఆ రంగంలో శిఖరాయమానంగా వెలుగొందుతారని జిల్లా విద్యాశాఖ అధికారి ఏటూరి సోమశేఖర శర్మ అన్నారు. మండల పరిధిలోనే చిరునోముల ఉన్నత పాఠశాలలో చిన్నారుల కథల పేరుతో రూపొందించిన పుస్తకాన్ని సోమశేఖర శర్మ మంగళవారం ఆవిష్కరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉప్పుశెట్టి ఖాదర్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చిరునోముల చిన్నారుల రాసిన కథలు వస్తు వైవిధ్యంతో చాలా హృదయ రంజకంగా ఉన్నాయని విద్యార్థులను అభినందించారు. విద్యార్థులలో గల నైపుణ్యానికి వన్నెలద్దే ప్రయత్నం చేసిన తెలుగు ఉపాధ్యాయులు పొత్తూరి సీతారామరావుని, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు మరెన్నో మంచి కథలు రాయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ పుస్తకంలో 27 కథలు రాయటం చిన్నారులు అతి తక్కువ వయసులోనే విద్యార్థులు ఎంతో మంచి కథలు రాసి నన్ను ప్రభావితం చేశారని విద్యార్థులను అభినందించారు. రాసిన 27 కథలను చూస్తే ఎంతో బాగా ఉన్నాయని అభినందించారు. ఈ 27 కథలలో తన హృదయాన్ని గెలిచిన కథను ఉత్తమ కథగా ఎంపిక చేసుకుంటానని ఆ కథను రాసిన విద్యార్థికి తన బాధ్యతగా రూ. 1,016 లను అందజేస్తానని ఆయన ప్రకటించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇటువంటి మంచి కథలు రాస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన అన్నారు. ఖమ్మం కు చెందిన ప్రముఖ కథా రచయిత జీవన్ బాల సాహితీవేత్త జిల్లా కన్వీనర్ కోండ్రు బ్రహ్మం చిరునోముల చిన్నారుల కథల సమీక్షను నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ప్రతిభావంతంగా కథలను రూపొందించారని, ఒక్కొక్క కథ ఒక సామాజిక అంశాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించడం చాలా గొప్ప విషయమని అభినందించారు. 27 కథలు సమాజంలో జరుగుతున్న ఒక్కొక్క అంశాన్ని కళ్ళకు గట్టినట్లు రాశారని అన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు పొత్తూరు సీతారామారావు విద్యార్థులచే ఇంత గొప్ప కథలను రాసే విధంగా తయారు చేయటం చాలా అభినందనీయమన వారు కొనియాడారు. భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే కథలను రాసే విధంగా విద్యార్థులను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మలినీడు ఇందిరా జ్యోతి, ఖమ్మం బాల సాహితీవేత్తలు కన్నెగంటి వెంకటయ్య, కొల్లు వెంకటేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు అలవాల నాగేశ్వరరావు, ఖమ్మం విద్యావేత్తలు కొండపల్లి శ్రీనివాసరావు, హరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పందిళ్ళపల్లి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు మనోరమ పాడిన గీతాలు అద్భుతంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు వాసిరెడ్డి సీతారామయ్య, ముష్టికుంట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలిన చలపతిరావు, చిరునోముల చిన్నారుల కథల రూపకర్త పొత్తూరి సీతారామారావు, ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, పి నాగేశ్వరరావు, ఎస్ సుందర రామరాజు, రోజా జానకమ్మ, ఆర్ రమేష్ బాబు, వి కిరణ్మయి, పీఈటి జి సైదేశ్వర రావు, రికార్డ్ అసిస్టెంట్ ఎస్ అర్జునాచారి క్రాఫ్ట్ టీచర్ నట రాజేశ్వరి, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భూతం ప్రీతం, ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, విద్యా కమిటీ చైర్మన్ వేమ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.