వరద పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Thursday September 09, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 8, ప్రజాపాలన : వరద పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గోదావరి నది, ఎన్.టి.ఆర్. నగర్, రాళ్ళవాగు వద్ద వరద నీటి ఉధృతి, పరిస్థితిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై వారిని అప్రమత్తం చేయాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టడంతో పాటు పునరావాస కేంద్రాలను గుర్తించి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, ఎవరు కూడా చేపలు పట్టేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఆయా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల తహశిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు  తదితరులు పాల్గొన్నారు.