జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Monday January 23, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 21, ప్రజాపాలన :
 
జిల్లాలో ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమితో కలిసి జిల్లా శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా జరిగేలా ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. వేడుకలలో ప్రభుత్వ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలతో ప్రజలకు తెలిసే విధంగా స్టాళ్ళను ఏర్పాటు చేయాలని తెలిపారు. వేడుకలకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మౌళిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల నుండి అత్యున్నత సేవలు అందిస్తున్న వారితో పాటు వివిధ రంగాలలో ఉ త్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల పురోగతిని తెలియజేస్తూ ప్రగతి నివేదిక సిద్ధం చేయాలని, శాఖల వారిగా శకటాల ప్రదర్శన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దేశభక్తిని తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్.డి.ఓ. వేణు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.