సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ తో ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది.

Published: Saturday June 11, 2022
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
 
మంచిర్యాల బ్యూరో, జూన్ 10, ప్రజాపాలన :
 
 
సింగరేణి స్థలాలలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న అర్హులైన వారికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ద్వారా చిరకాల వాంఛ నెరవేర్చిందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్, పార్లమెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరితో కలిసి 587 మంది లబ్దిదారులకు 2వ విడత సింగరేణి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ తెలంగాణకే తలమానికమైన సింగరేణి బొగ్గు గనులలో కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి నల్ల బంగారాన్ని వెలికి తీసి రాష్ట్రానికి వెలుగులు అందిస్తున్నా రని అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణ అస్తిత్వం, పునర్జీవం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, 60 ఏండ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగలేదని, 2014 సింగరేణి ఎన్నికల మేనిఫెస్టులో ఇచ్చిన మాట నిలబెట్టుకు న్నామని అన్నారు., జీ. ఓ. నం. 76 ద్వారా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే సుమారు 5 వేల మందికి పైగా లబ్ధిదారులు ఇండ్ల యజమానులు అవుతారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న 3 వేల 929 మందికి పట్టాలు అందేలా చూస్తామని, జీ, ఓ. నం. 76 కాల పరిమితిని పెంచడం వల్ల సుమారు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో మరింత మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
 18 ఏరియాల్లో సింగరేణి ప్రభావిత ప్రాంతమని తిరస్కరించిన 7 ఏరియాలను సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి తిరిగి జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు. సింగరేణి ఏరియాలో ఖాళీగా ఉన్న 4 వేల క్వార్టర్లలను రెవెన్యూ శాఖకు అప్పగించి తద్వారా నామమాత్రపు రుసుముతో పేద ప్రజలకు అందించేలా చర్యలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆర్.కె.4 గడ్డ, శాంతినగర్, వల్లభాయి నగర్, నాగార్జున కాలనీ, ప్రగతి కాలనీ, రాజీవ్ నగర్, ఠాగూర్ నగర్, రామ్ నగర్, భగత్ సింగ్ నగర్, గంగా కాలనీ, సూపర్ బజార్ ఏరియా, దుర్గా రావు మార్కెట్, గీతా మందిర్ ఏరియా లో మిస్ అయిన ఇండ్లను తిరిగి జాబితాలో చేర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగు రామన్న, శాసనమండలి సభ్యులు దండే విఠల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ గారు, జిల్లా కలెక్టర్ భారతి హెుళ్లికేరి గారు, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, నాయకులు పాల్గున్నారు.