ఖాళీ ప్లాట్లలో మున్సిపాలిటీ హెచ్చరిక బోర్డులు

Published: Friday November 11, 2022
మధిర నవంబర్ 10 ప్రజాపాలనప్రతినిధి
 మున్సిపాలిటీ పరిధిలోని లడక్ బజార్ అయ్యప్ప నగర్ లో కంప చెట్లు పెరిగిపోయి ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఖాళీ ప్లాట్లలో మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి ఆదేశాల మేరకు సిబ్బంది గురువారం ఈ స్థలం మున్సిపాలిటీ వారిది అతిక్రమించిన వారు శిక్షార్హులు అని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పట్టణ హరితహారం కార్యక్రమం లో భాగంగా జూన్ 4వ తేదీన మున్సిపాలిటీలోని 18 వ వార్డులో పర్యటించిన కలెక్టర్ అయ్యప్ప నగర్ లో ఖాళీ స్థలాల్లో పెరిగిన కంపచెట్లను తొలగించేందుకు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కమిషనర్ కు సూచించారు. ఇటీవల ప్లాట్లలో పెరిగిన కంపచెట్ల వలన విష పురుగులు పాముల సంచారం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు భయబ్రాంతులకు గురవుతున్నారని పలు పత్రికలలో వార్త కథనాలు రావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ కంపచెట్లు పెరిగిన ఖాళీ ప్లాట్లలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించిన మేరకు పలు ఖాళీ స్థలాలలో హెచ్చరిక బోర్డులను మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ప్లాట్ల యజమానులు స్వచ్ఛందంగా ప్లాట్లను శుభ్రం చేయించుకోవాలని లేని పక్షంలో చర్యలు చేపడతామని ఆమె హెచ్చరించారు. గతంలో టూ టౌన్ ప్రాంతంలో కూడా కంప చెట్లు పెరిగిన ప్లాట్ లలో ఇటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో ఫ్లాట్ల స్వచ్ఛందంగా శుభ్రం చేయించుకున్నారు. ఖాళీ ప్లాట్ల యజమానులు ఎప్పటికప్పుడు కంపచెట్లు పెరగకుండా చూసుకోవాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు