పండుటాకులకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వ పథకం ఆసరా : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Published: Friday September 16, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
పండుటాకులైన వృద్ధులకు ప్రభుత్వ పథకం ఆసరా బాసట గా నిలుస్తుందని,ప్రభుత్వం వృద్ధులకు ఇస్తున్న ఆసరా పెన్షన్ లను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ పెన్షన్ లను ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాక ముందు పెన్షన్ లు ఎలా ఉండేవో ప్రస్తుతం ఎంత పెన్షన్ వస్తుందో ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టి నిరుపేదలకు చేయూతగా ఉందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కె సి ఆర్ దే అన్నారు. వృద్దాప్యంలో ఏ ఆధారం లేని వారికి ఆసరా పెన్షన్ లు అండగా ఉంటాయన్నారు.అర్హులైన వారికి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఆసరా పెన్షన్ కార్డులను అందజేస్తున్నామన్నారు. కల్యాణ లక్ష్మి, దళిత బంధు వంటి గొప్ప పథకాలు చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. అర్హులైన అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ లు ఇస్తుందని అన్నారు.ఈ సందర్బంగా అమీర్ పేట్, ఖైరతాబాద్,బాలానగర్ మూడు మండలాలకు  చెందిన దాదాపు 700 మందికి ఆసరా పెన్షన్ లను పంపిణీ చేశారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016, వికలాంగులకు 3016 రూపాయలు చొప్పున ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు 200 , 500 రూపాయల పెన్షన్ ను ఇచ్చే వారని, వాటి కోసం లబ్ధిదారులు అనేక అవస్థలు పడేవారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న నేపధ్యంలో నూతనంగా మరో 10 లక్షల మందికి పెన్షన్ లను మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో 65 సంవత్సరాలు దాటిన వారికి  పెన్షన్ లను ఇవ్వడం జరిగిందని, దానిని 57 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు.  ఇదే కాకుండా పేదింటి ఆడపడుచుల పెండ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ల క్రింద లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. గర్భిణీ మహిళలకు కె సి ఆర్ కిట్ క్రింద పాప పుడితే 13 వేలు, బాబు పుడితే 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇవే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. సనత్ నగర్ లో మంచి నీటి రిజర్వాయర్ నిర్మాణం, 5 కోట్ల తో ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ఎక్కడా ఎలాంటి లీకేజీలు లేకుండా సీవరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కె సి ఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, ఆర్ డి ఓ  వసంత, ఎం ఆర్ ఓ విష్ణు సాగర్, టి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు సురేష్ గౌడ్, అశోక్ యాదవ్, ఖలీల్, శేఖర్, గుడిగే శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు