స్థానిక వైద్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి

Published: Saturday February 11, 2023
 1996 కంటే ముందు ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్
* 1996 తర్వాత నియామకమైన ప్రభుత్వ వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్య కళాశాలలో వాటా ఎంత
* అసెంబ్లీ సమావేశాలలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నావళి
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : స్థానిక ప్రభుత్వ వైద్యులకు నియామకాలలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తే వైద్య సేవలు అందించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలోని ప్రశ్నోత్తరాల సమయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శాసనసభ అధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా సంబంధిత శాఖల మంత్రులకు ప్రశ్నల పరంపరను కొనసాగించారు. వికారాబాద్ ఎమ్మెల్యే ప్రశ్నావళిని సంధించే ముందు శాసనసభ అధ్యక్షుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పాత, కొత్త వైద్య కళాశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా వివరాలు తెలపాలని స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ రాష్ట్ర ప్రభుత్వాలలో కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాలలో వైద్య కళాశాలల పరిస్థితిని తెలపాలని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ వైద్యులకు హెచ్ఆర్ఏ తక్కువగా ఉండడం, బదిలీలు ఎప్పుడు అవుతాయో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో విధులు నిర్వహించే ప్రభుత్వ వైద్యులకు హెచ్ఆర్ఏ ఎక్కువగా వస్తున్నదని వివరించారు. గ్రామీణ ప్రాంత వైద్యులకు రెగ్యులర్ బదిలీలు, అదనంగా ఆర్థిక వనరులు కల్పించే విషయంలో ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదనే నిబంధనను తెస్తున్నట్లు సమాచారం. కాకపోతే 1996 కంటే ముందు ప్రభుత్వ వైద్యులుగా నియామకమైన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చని, 1996 తర్వాత ప్రభుత్వ వైద్యులుగా నియామకమైన వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోరాదనే నియమంలో స్పష్టత ఇవ్వాలన్నారు. వైద్య కళాశాలలో ప్యారామెడికల్ కోర్సులను ఎప్పటి నుండి ఏఏ కోర్సులను చేర్చనున్నారో స్పష్టత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వహించే ప్రభుత్వ వైద్యులకు స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వికారాబాద్ ప్రాంతానికి వైద్య కళాశాల వచ్చింది. వికారాబాద్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు రాంచందర్ నిజామాబాద్ ఆసుపత్రిలో సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నారు. నా స్నేహితుడు వైద్యుడు వేదవ్యాస్ మంచిర్యాల లో విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. డెంటల్ కళాశాలల సంఖ్యను పెంచాలని సూచించారు. మోమిన్పేట్ హాస్పిటల్ కు ఒక కోటి 56 లక్షలు నిధులు భవన నిర్మాణానికి మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు వైద్య శాఖ మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ వైద్య కళాశాలలో తరగతులు ఎప్పటినుండి ప్రారంభమవుతాయని ప్రశ్నించారు. నర్సింగ్ కళాశాల తో పాటు డెంటల్ కళాశాలను కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పల్లె దవఖానాలు కేరెల్లి నాగారం తొర్మామిడి గ్రామాలలో ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ మంత్రిని అడిగితే సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. మర్పల్లి మండలానికి చెందిన సిరిపురం, కల్ఖోడ, బార్వాది గ్రామాలలో వైద్యులను నియమించాలని కోరారు.