సేవచేయడానికా చెత్త ఏరించడానీకా సర్పంచులు ఎన్నికైనది మండల పరిషత్ సమావేశం లో సర్పంచులు అధిక

Published: Friday June 03, 2022
బోనకల్, జూన్ 2 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని సర్పంచులు జనానికి సేవ చేయడం కోసమా చెత్త ఏరించడం కోసమా సర్పంచులు చట్టబద్ధంగా ఎన్నికైనదని ,నేడు గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో సర్పంచులు ఉన్నారని, ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటూ ఆళ్లపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం అధ్యక్షతన ఏర్పాటుచేసిన పల్లె ప్రగతి అవగాహన సదస్సులో అసహనం వ్యక్తం చేశారు. గత మండల పరిషత్ సమావేశాలు సైతం సమస్యలు వివరించినప్పటికీ అధికారులు ఎవరు ప్రజాప్రతినిధుల మాటలు విని విననట్టు గా వ్యవహరిస్తున్నారని, గ్రామాల్లో ప్రజా సమస్యలు నెరవేర్చలేని స్థితిలో మేమున్నామంటూ సర్పంచ్ లుగా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వారి అవసరాలు తీర్చడానికి అని నేటికీ అవి అమలులో సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో శానిటేషన్ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నదని, మొక్కలకి శానిటేషన్ పనులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజా సమస్యలు పరిష్కరించటానికి ఇవ్వటం లేదని, నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పక్కా గృహాలు లేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు కలిసి జీవిస్తున్నారని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ లు ఇవ్వలేకపోయామని, నివాస స్థలాలు ఇవ్వలేకపోయామని, గత మండల పరిషత్ సమావేశంలో విన్నవించుకున్నా సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని, మొక్కలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజ సమస్యలు పరిష్కారానికి ఇవ్వడం లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలి రేట్లు పెరిగాయని తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో ఆచరణకు సాధ్యంకాని అంశాలను పల్లెప్రగతిలో పొందుపరుస్తూ సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రానురాను ప్రజల యొక్క విశ్వసనీయత కోల్పోతున్నామని అన్నారు.ఈ సందర్భంగా బ్రాహ్మణ పల్లి సర్పంచ్ రవీంద్ర మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం పట్ల మలేరియా డెంగ్యూ లాంటి విషపూరిత వ్యాధులు రాకుండా, పల్లెలను శుభ్రం చేసుకొంటున్నామని అన్నారు. కాగా కొన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ఆసక్తిని కనబరుస్తు పోవడం కొసమెరుపుగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గొట్టిపాటి శ్రీదేవి, జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.