ఆర్థిక అభివృద్ధికి ఆహార శుద్ధి పరిశ్రమలు

Published: Friday November 18, 2022
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 17 నవంబర్ ప్రజా పాలన : ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్, సెర్ప్, డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో పిఎంఎఫ్ఎంఇ పథకం( ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ ) పై అవగాహన,  రుణాలు అందించే కార్యక్రమం పై జిల్లా మహిళా సమాఖ్య సభ్యులచే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మహిళలు తమకు నచ్చిన రంగాల్లో కుటీర పరిశ్రమలను స్థాపించుకొని ఆర్థికంగా ఎదిగేందుకు  పథకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.  జిల్లాలోని  మహిళా సమైఖ్యలకు పెద్ద మొత్తంలో రుణాలు అందించడానికి ముందుకు వచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఉన్నత అధికారులను ఆయన అభినందించారు. ఇప్పటికే జిల్లాలోని 19 మండలాల్లో 274 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సబ్సిడీతో కూడిన రుణాలను అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా అధికారులే లబ్ధిదారుల చెంతకు వెళ్లి బ్యాంకు ప్రక్రియను పూర్తి చేయడం మంచి పరిణామం ఆయన అన్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆయన సూచించారు. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సౌత్, మహారాష్ట్ర జోనల్ బిజినెస్ హెడ్ అమిత్ లఖన్ పాల్ మాట్లాడుతూ.. ఇండియా మొత్తంలో 6,500 బ్రాంచ్ లు పనిచేస్తున్నాయని అయినప్పటికీ వికారాబాద్ జిల్లాలో పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా అందించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా,  సమూహంగానైనా రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమం ముందుగా పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ఉద్దేశాలు, రుణం పొందే విధానం పై తెలంగాణ ఇంచార్జ్ ప్రభంజన్ లబ్ధిదారులకు, మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కృష్ణన్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు ఉన్నతాధికారులు సుబ్రమోణి భాగవతి, బేరే రామకృష్ణ, సోహెల్ పర్వాజ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అలవేలు, ఏపీవోలు,  సీసీలు తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం  అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , డిఆర్ డిఓ కృష్ణన్ , బ్యాంకు అధికారులు రుణ మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో కృషి చేసిన ఏపీవోలు,  సిబ్బందిని సన్మానించారు.