అర్హులైన ప్రతీ ఒకరికి దళితబంధు. ...జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday August 03, 2022
మంచిర్యాల బ్యూరో,  ఆగస్టు 2, ప్రజాపాలన:
 
దళితుల అభ్యున్నతి దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్దిదారుడికి వర్తింపజేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రాష్ట్ర దళితబంధు సలహాదారు లక్ష్మారెడ్డితో కలిసి దళితబంధు లబ్దిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని, అభ్యర్థులకు ప్రభుత్వం అందించిన వివిధ రకాల యూనిట్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమలు, మత్స్య అభివృద్ధి దిశగా లబ్దిదారులు దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున మంజూరు ప్రక్రియ రూపొందించగా 84 యూనిట్లు గ్రౌండింగ్ చేయబడి సంబంధిత లబ్దిదారుల ఖాతాలలో 8 కోట్ల 31 లక్షల రూపాయలు చొప్పున, ఖానాపూర్ నియోజకవర్గ భాగంలో 13 యూనిట్లు మంజూరు ప్రక్రియ కాగా 13 యూనిట్లు గ్రౌండింగ్ చేయబడి సంబంధిత లబ్దిదారుల ఖాతాలో 1 కోటి 18 లక్షల రూపాయలు మొత్తంగా 313 యూనిట్లకు గాను 265 మంది లబ్దిదారులకు 26 కోట్ల 13 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. దళితుబంధు పథకంలో డైరీ యూనిట్లు, విత్తనాలు, ఫెస్టిసైడ్స్, గొర్రెలు / మేకలు, కోళ్ళ ఫారం, ఫిష్ పాండ్, నిర్మాణ రంగ, పేపర్ ప్లేట్స్-గ్లాస్ తయారీ, సెరామిక్స్, ప్రజారవాణా, గూడ్స్ వాహనాలు, జె.సి.బి. / హార్వెస్టర్, ట్రాక్టర్-ట్రాలీ, టెంట్ హౌజ్, డయాగ్నొస్టిక్ ల్యాబ్ తదితర యూనిట్లు పొందుపర్చడం జరిగిందని, అర్హత గల దళిత అభ్యర్థులు యూనిట్లను ఎంచుకొని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ అధికారి డా॥ శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన అధికారి యుగంధర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పశు వైద్యాధికారులు, దళితబంధు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.