క్రీడాకారుల ప్రతిభను గుర్తించి సానబెట్టాలి

Published: Thursday January 12, 2023
 మాజీ మంత్రి బిజెపి నాయకుడు ఆలె చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజా పాలన : వివిధ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల ప్రతిభను గుర్తించి సాన బెట్టాలని మాజీ మంత్రి బిజెపి నాయకుడు రాష్ట్ర లగోరి అధ్యక్షుడు ఆలె చంద్రశేఖర్ సూచించారు. బుధవారం వికారాబాద్ మున్సపల్ పరిధిలోని కొండ బాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో వివిధ క్రీడలు, సామాజిక సేవ, కరోనా కష్టకాలంలో సేవలందించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర లగోరి ప్రధాన కార్యదర్శి పెద్దింటి నవీన్ కుమార్, రాఘవన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పి చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి,
చేవెళ్ళ మాజీ ఎంపి కొండావిశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ తుప్ప ఆనంద్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, ఎంపిపి కామిడి చంద్రకళ, జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ నర్సిములు, సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కూర జయదేవ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, కౌన్సిలర్లు చందర్ నాయక్, గాయత్రీ లక్ష్మణ్, శ్రీదేవి సదానంద్ రెడ్డి, మారుతీ కిరణ్, హన్మంతురెడ్డి, వడ్ల నందు, జిల్లా క్రీడల అధికారి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా వారియర్స్, క్రీడాకారులకు సన్మానం నిర్వహించడం అభినందనీయమని పెద్దింటి నవీన్ కుమార్ ను  ప్రశంసించారు. బిజెపి నాయకులందరూ కరోనా సోకిన వారందరికీ ఇంటింటికీ వెళ్ళి ఆహారం అందించారని గుర్తు చేశారు. క్రీడలు కేవలం పాఠశాలలోనే కాకుండా తమకు అనుకూలమైన స్థలాలలో నేర్చుకోవాలని హితువు పలికారు. ఆటస్థలాలు లేక క్రీడలలో ఎదగలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతి ఊరిలో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేయించారని స్పష్టం చేశారు. ప్రతి క్రీడా ప్రాంగణానికి ప్రధాని రూ. 12 లక్షలు నిధులు మంజూరు  చేశారని వెల్లడించారు. ప్రతి ఊరిలోని క్రీడాప్రాంగణాన్ని గుర్తించి ఆడుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ పాలనలో భారతదేశానికి వచ్చినన్ని గోల్డ్ మెడల్స్ ఏ దేశానికి రాలేదని ఘంటాపథంగా చెప్పారు. యోగ సాధన చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులవుతారని వివరించారు. డాక్టర్ తుప్ప ఆనంద్ మాట్లాడుతూ
నిజమైన ప్రతిభను గుర్తించి  ప్రోత్సహించాలన్నారు. కులమతాలకు అతీతంగా క్రీడలలో రాణించే విధంగా ప్రోత్సాహం అందించాలని సూచించారు.
ఆటల వలన మానసిక వికాసం, చురుకుదనం, నాయకత్వం, సమయస్ఫూర్తి, ఏకాగ్రత వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.
క్రీడలతో పరిస్థితులను తట్టుకునే శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయన్నారు.
సేవాతత్పరత నీ జీవితాంతం జ్ఞాపకంగా మిగులుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇండోర్ అవుట్ డోర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా సెల్ ఫోన్లకు అతుక్కుపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా క్రీడాకారులను ప్రోత్సహిస్తే భవిష్యత్ తరాలవారు ప్రేరణ పొందుతారని తెలిపారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి చదువు విషయంలో నే ఆరా తీస్తారు. కానీ మార్నింగ్ వాకింగ్ చేశావా నీకు ఇష్టమైన ఆటలు ఆడావా అని అడగరని విమర్శించారు.
క్రీడాకారులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణం అలవాట్లు సాంఘిక జీవనం ఐకమత్యం వంటి విషయాల గురించి తెలుసుకునే అవకాశం దక్కించుకుందన్నారు. క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో ఏ ఆట ప్రాచుర్యం పొందినదో దాంట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే జాతీయ స్థాయిలో రాణిస్తారని గంటాపథంగా చెప్పారు. మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నా బాల్యదశలో క్రీడలంటే పెద్దపెద్ద పట్టణాలలోనే ఉండేవని అన్నారు. నిఖత్ జరీన్ నిజామాబాద్ వాసి. ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర పథకాలు, నిధులు ఉన్నాయన్నారు. క్రీడలకు వచ్చే నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే క్రీడలకు నిధులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సిఎంకు, విద్యాశాఖ మంత్రి కి క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం అందజేస్తాను అన్నారు. జడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
కరాటే అంటే నాకు ఎంతో ఇష్టం. నా చిన్నతనంలో కరాటే నేర్చుకునేందుకు కరాటే డ్రెస్ కుట్టించుకున్నాను. కానీ కరాటే మాస్టారు ట్రాన్స్ఫర్ అవడంతో నేర్చుకోలేకపోయానని తన మనోగతాన్ని వెల్లడించారు. జడ్పి నిధుల నుండి రూ.25వేల రూపాయలు మంజూరు చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు.
తగినన్ని నిధులు ఉంటే క్రీడలకు ఎక్కువ కేటాయిస్తామని భరోసా కల్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను రంజింప చేశాయి.