కరోన థర్డ్ వేవ్ జాగ్రత్తలు తీసుకోవాలి

Published: Wednesday August 25, 2021
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
ఆధునిక వ్యవసాయ పద్ధతుల అవగాహన కల్పించాలి
ఆర్ అండ్ బి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
సర్వ సభ్య సాధారణ సమావేశంలో మాట్లాడిన జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి
వికారాబాద్ బ్యూరో 24 ఆగస్ట్ ప్రజాపాలన : కరోనా వలన గతంలో జనరల్‌బాడీ సమావేశం నిర్వహించలేక పోయామని జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించడానికి సర్వ సభ్య సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. కరోనా థర్డ్‌వేవ్‌ వస్తోందని వార్తలు వస్తున్నాయని హెచ్చరించారు‌. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. వాక్సినేషన్‌ వందశాతం పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. గతేడాది జిల్లా పరిషత్‌ నుంచి కరోనా నివారణకు జిల్లాలో అనేక చర్యలుతీసుకున్నామని గుర్తు చేశారు. మనం తీసుకున్న చర్యలపట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఎలాంటి ఆపత్కర పరిస్థితులు వచ్చిన జడ్పీ నుంచి బాధ్యతగా వ్యవహరిస్తామని భరోసా కల్పించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించాలని ఉద్ఘాటించారు. రైతులు పొలాలకు వెళ్ళడానికి రోడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే జడ్పీ నుంచి పానాది రోడ్లు వేయించామని వివరించారు. రైతులు పంటను ఇంటికి తీసుకురావడానికి వీలైందని కొనియాడారు. ముఖ్యంగా రైతుల భూములకు మార్కెట్‌లో విలువ కూడా పెరగడం సంతోషించదగిన విషయం అన్నారు. రోడ్లు వేసిన దగ్గర రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకు అందరికీ రైతుబంధు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది రైతులకు పాసు పుస్తకాలు పెండింగ్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారమని చెప్పారు. కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని అందరికీ పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఆర్అండ్‌బీ రోడ్లు వర్షాలకు పాడవడంతో ప్రమాదాలకు మూలహేతువని ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు మంజూరైన బ్రిడ్జీల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ధ్వంసమైన ఆర్అండ్‌బీ, పంచాయతీ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వారు సేవలు అందించడం అభినందనీయమని ప్రశంసించారు. తాండూరు జిల్లా ఆస్పత్రికి జడ్పీ నుంచి సుమారు 60 లక్షల నిధులు ఖర్చుచేశామని వివరించారు. వైద్యులకు కిట్లు కూడా అందజేశామని గుర్తు చేశారు. ఈ మధ్య డెంగ్యూ జ్వరాలు బాగా ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో గ్రామాల్లో పారుశుద్ధ్యం మెరుగు పరిచేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూస్‌ అధికారులు మిషన్‌ భగీరథ నీళ్లు ప్రతీ ఇంటికి చేరేలా చూడాలని ఉద్ఘాటించారు. కొన్ని గ్రామాల్లో నేటికి భగీరథ నీటిని తాగకుండా బట్టలు ఉతకడానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మిషన్ భగీరథ వాటర్‌పై ప్రజలకు అవగాహన కల్పించకపోవడం మన తప్పిదమేనని అన్నారు. జడ్పీ నుంచి ఇప్పటికే మంజూరైన పనులను పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలల మరమ్మత్తులకు, కొత్త క్లాసు రూమ్‌లకు నిధులు మంజూరు చేశామన్నారు. పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అంగన్‌వాడీ భవనాలు పూర్తి చేయాలన్నారు. మిగిలిన నిధులను కూడా మంజూరు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. నాణ్యతలో మాత్రం రాజీ పడితే ఇంజినీర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంజనీర్ల పర్యవేక్షణలోనే పనులు జరగాలని పేర్కొన్నారు. అనుమతి లేని పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలులేదని చెప్పారు. ఉపాధి హామీ పథకంలోని నిధులును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం కింద చేపట్టిన స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు ప్రతీ గ్రామంలో  పూర్తి చేయాలని వివరించారు. నాటిన మొక్కలకు నీళ్లు పోస్తు సంరక్షించాలని అన్నారు. గ్రామాల్లో పారుశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు డీపీఓ పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్‌ షాక్‌లతో రైతులు, అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్‌ల ద్వారా మంజూరైన రుణాలను గ్రౌండింగ్‌ చేయాలన్నారు. చాలా వరకు బ్యాంకుల్లో నేటికి పెండింగ్‌లో ఉండడంతో లబ్దిదారులు ఫోన్‌లు చేస్తున్నారని గుర్తు చేశారు. రుణాలు అందించి స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు సకాలంలో రేషన్‌ సరుకులు అందించాలన్నారు.  కొన్ని గ్రామాల్లో రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని వివరించారు. రెవెన్యూ వారు నిఘాపెట్టాలని కోరారు. అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. అడవుల్లో వన్యప్రాణులకు పండ్ల చెట్లు నాటాలని హితవు పలికారు. అనంతగిరి అడవుల్లో వందల రకాల పక్షులు ఉన్నాయని అన్నారు. వాటిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు.  మన జిల్లాలో కూరగాయల సాగుకు అనుకూలంగా ఉన్న గ్రామాలను గుర్తించి రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రోత్సాహం కల్పించాలని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేదవారికి అందేలా అధికారులు చూడాలని పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు ఫింఛన్ల కోసం కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారని చెప్పారు. కొత్త పింఛన్ల మంజూరుకు మీసేవా కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారిని దరఖాస్తు చేయించాలని సభ్యులను కోరుతున్నాను అన్నారు. జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక భూమిక పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జడ్పీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, పొలాలకు పానాదులు, నీటి సమస్య ఉన్న దగ్గర బోర్లు వేయించడం, డ్వాక్రా, అంగన్‌వాడీ భవనాలు నిర్మించడం వంటి పనులు చేశామని గుర్తు చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ  సమావేశంలో ముఖ్య అథితులుగా హాజరైన చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పౌసమి బసు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సీఈఓ జానకీరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్‌ సభ్యులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.