ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర

Published: Tuesday January 03, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 2,  ప్రజాపాలన : 
 
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం చేపట్టి అమలు చేస్తుందని, ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కైర్గాం గ్రామానికి చెందిన ముంజం సృజన తన భర్త ఆనందారావు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో టి.ఎస్.డబ్ల్యు. ఆర్. (బి)లో పని చేస్తూ మృతి చెందారని, తన సంపాదనపై ఆధారపడి జీవించే మాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారని, వారి పోషణ నిమిత్తం జీవనోపాధి కల్పించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మందమర్రి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన తోట గౌరయ్య నేను నా సోదరులతో కలిసి ప్రభుత్వ ప్రోత్సాహంతో పామ్ ఆయిల్ సాగు చేసేందుకు నిర్ణయించుకోగా ఉద్యానవన శాఖ వారు బోరు తప్పనిసరిగా ఉండాలని చెప్పడంతో విద్యుత్ శాఖ వారిని సంప్రదించగా వారి సూచన మేరకు సొంత ఖర్చుతో బోరు వేసి విద్యుత్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నామని, విద్యుత్ కనెక్షన్ ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. చెన్నూర్ మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన రత్న రవీందర్ తన దరఖాస్తులో గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, వీటిని నిలుపుదల చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన సందనవేని శంకర్ తాను 20 సంవత్సరాలుగా నెన్నెల గ్రామ శివారులోని భూమిని సాగు చేసుకుంటూ ఫైనల్ పట్టా కలిగి కాస్తు, కబ్జాలో ఉన్నానని, భూ ప్రక్షాళన అనంతరం ఇట్టి భూమికి ధరణిలో తన పేరు రాలేదని, తన పేరిట నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన గొల్ల సత్యనారాయణ తాను దివ్యాంగుడినని, ఆర్థిక సంవత్సరానికి జిల్లా కేటాయించిన 3 వీలర్స్లో తనకు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణంలోని వినూత్న కాలనీ వాసులు తమ దరఖాస్తులో వినూత్న కాలనీలో దాదాపు 100 కుటుంబాలు నివాసం ఉంటున్నామని, మురుగు కాలువలు లేనందున కాలనీ రోడ్లలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని, మా సమస్యలు పరిష్కరిస్తూ మురుగు కాలువలు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.