ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్‌ డే

Published: Friday September 16, 2022
హైదరాబాద్ 15 సెప్టెంబర్ ప్రజాపాలన: పంచాయతీ రాజ్ ఆందోల్ డివిజన్ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే ను జరుపుకున్నారు. 
సంగారెడ్డి జిల్లా ఆందోల్ పంచాయతీ రాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో 161 వ జాతీయ ఇంజనీర్స్ డే ను ఇంజనీర్ల సమక్షంలో జరుపుకున్నారు. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి అందరు ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ 
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అద్యక్షులు అంజయ్య తాల్క మాట్లాడుతూ...
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని భారతీయ ఇంజనీరింగ్‌ రంగానికి పితామహుడుగా అభివర్ణించవచ్చు. తన నైపుణ్యాలతో, ఇంజనీరింగ్‌ విద్యా పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధివైపు అడుగులు వేయిస్తూ దేశానికి సారథ్యం వహించారు. విశ్వేశ్వరయ్య గారు కర్ణాటకలోని మైసూర్‌ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో జన్మించారు. అనేక కష్టనష్టాలకు సైతం ఓర్చుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ట్యూషన్‌లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్‌ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్ర లోని నాసిక్‌ లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గా ఉద్యోగంలో చేరాడు. 
భవిష్యత్తులో దేశానికి వ్యవసాయం, పరిశ్రమలే ముఖ్య అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి తీసుకురావడానికి అనేక సేవలు చేశాడు. 101 సంవత్సరాల తన జీవితంలో దాదాపుగా 80 సంవత్సరాలు దేశం కోసం అహర్నిశలు పని చేశాడు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955 లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య ఈ దేశానికి చేసిన సేవలకు గాను 1968 లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
హైదరాబాద్‌ లో 1908 లో మూసీ నదికి వరదలు వచ్చాయి. నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో అనేక వంతెనలు నిర్మించి మూసీ నది కే ముక్కుతాడు వేసిన ఇంజనీర్‌ విశ్వేశ్వరయ్య. నాసిక్‌ లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గా సింధూ నది నీటిని సుక్కూరు ప్రాంతానికి అంటే దాదాపుగా 480 కిలోమీటర్లు తీసుకురావడం కోసం విశ్వేశ్వరయ్య చేసిన డిజైన్ లను చూసి మిగతా ఇంజనీర్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలపై మహరాష్ట్రలో పలు కమిటీలు వేసినప్పుడు విశ్వేశ్వరయ్య సలహాలు విని బ్రిటిష్‌ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇరిగేషన్‌లో బ్లాక్‌ సిస్టమ్‌ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్ధమైన నీటిని నిల్వ చేసి మరల వాడేవారు.
 
1952 లో అంటే 91 సంవత్సరాల వయసులో గంగానది మీద బ్రిడ్జి కట్టడానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తన జీవితమంతా తన నైపుణ్యాన్ని దేశ నిర్మాణానికి వినియోగించారు. తన దార్శనికత వల్లే నేటికీ కర్ణాటక మైసూర్‌ బలంగా, సుసంపన్నంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నేటి భారతీయ సమాజంలో ఉన్న నవ యువ ఇంజనీర్లు సమాజంలో ఉన్న సమస్యలకు ఇంజనీరింగ్‌ రంగం ద్వారా పరిష్కారం వెతికి దేశం ముందుంచాలి. అప్పుడే విశ్వేశ్వరయ్య ఆశయాలు, కలలు సాకారమవుతాయి. యువత నూతన సాంకేతిక విధానాల ఆవిష్కరణలకు కృషి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.