గౌడ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తాం

Published: Thursday August 19, 2021
వికారాబాద్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్
వికారాబాద్ బ్యూరో 18 ఆగస్ట్ ప్రజాపాలన : గౌడ సామాజిక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు కు అహర్నిశలు కృషి చేస్తానని జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బిజెఆర్ కూడలి, నవాబ్ పేట్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నర శతాబ్దాల క్రితం వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ పూర్ గ్రామంలో 1650 ఆగస్టు 18న బలహీన వర్గం గౌడ కుటుంబంలో జన్మించాడని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ బహుజనుల రాజ్యాధికారం కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాధికారం గురించి ఆలోచించడమే పాపంగా మారిన రోజుల్లో రాజ్యాధికార పీఠం అధిష్టించిన బహుజన సింహమని కొనియాడారు. వీరత్వంలో శివాజీకి ఏ మాత్రం తీసిపోని పాపన్నగౌడ్ అగ్రకుల దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేశారని ఉద్ఘాటించారు. అగ్ర కులాల గడీల కోటలపై దాడి చేసి సంపదను బహుజన పేదలకు పంచి పెట్టాడని వివరించారు. గడీలలో బందీగా మగ్గుతున్న అణగారిన కులాల పేదలను విడిపించాడానికి చేసిన పోరాటాలు మరువలేనివని ప్రశంసించారు. బహుజన సమాజం అభివృద్ధి కొరకు అహర్నిశలు పరితపించేవాడని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా గౌడ సంఘం తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కుడా పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కుల నాయకులతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మన్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, రాష్ట్ర యువజన గౌడ సంఘం అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, బందయ్య గౌడ్, శంకరయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపిటిసి మల్లేశం గౌడ్, సురేష్ గౌడ్, ప్రభు గౌడ్, అల్లిపూర్ తెల్ల బాల్ రాజ్ గౌడ్ , అక్నాపూర్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.