పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలి

Published: Tuesday September 13, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన:  
పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలని, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్థి శ్రీనివాస్ సోమవారం రోజున జిల్లా కేంద్రంలో  సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్టులు,వాటి కమిషన్ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద లేదని గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన  3000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకపోవడంతో ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్కాలర్షిప్లు రాకపోవడం తో యాజమాన్యాలు విద్యార్థులను సర్టిఫికేట్ల విషయంలో వేధిస్తున్నాయని అన్నారు దీంతో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక మనస్థాపానికి గురవుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం పేదల చదువు విషయంలో కేవలం హామీలు ఇస్తూ  ఆచరణ విషయంలో మాత్రం శ్రద్ధ చూపెట్టడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో   విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ
కార్యక్రమంలో విజయ్, మాధవ్,మహేష్,రాజ్ కుమార్,హైమద్,శ్రావణ్, శిరీష్, లక్ష్మన్ తదితరులు  పాల్గొన్నారు.