మాచన్నగారి నివాసంలో వికసించిన బ్రహ్మకమలాలు

Published: Tuesday June 29, 2021
పూజా కైంకర్యాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
వికారాబాద్, జూన్ 28, ప్రజాపాలన బ్యూరో : ద్వాదశ సంవత్సరాలకు వికసించే బ్రహ్మకమలాలు శివునికి ప్రీతి పాత్రమైన పుష్పరాజాలు. బ్రహ్మకమలాలు వికసించిన ఇంట అన్ని శుభాలు కలుగుతాయని హైందవుల ప్రగాఢ విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు చేతి వ్రేళ్ళ పక్ష వాతానికి మెదడు సంబంధిత వ్యాధులకు వాడుతారు. ఈ పుష్పాలు రాత్రి సమయంలోనే వికశిస్తాయని పెద్దల ఉవాచ. రాత్రి సమయాల్లో వికసించే పువ్వులను ఎఫీఫైలమ్ ఆక్సీపెటాలమ్ అను కాక్టస్ మొక్కను బ్రహ్మకమలంగా భావిస్తారు. బ్రహ్మకమలాలు ఆకులకు మాత్రమే వికసించే ప్రత్యేక పూలరాజు. ఇంటిల్లిపాది తలంటు స్నానాదులు చేసి ప్రత్యేక నైవేద్యంతో శివాలయానికి వెళ్ళి ప్రదక్షణుల అనంతరం శివునికి అర్పిస్తారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 23వ వార్డు పరిధిలో గల మాచన్నగారి వనజ గృహంలో బ్రహ్మకమలాలు వికసించాయి. కుటుంబ సభ్యులు మాచన్నగారి గైబులు ముదిరాజ్, మాచన్నగారి వనజ, మాచన్నగారి సౌమ్య, మాచన్నగారి సౌజన్యలు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం చుట్టు పక్కల ఇళ్ళవారు బ్రహ్మకమలాలను చూసి తరించారు. ఉత్తరా ఖండ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర పుష్పం బ్రహ్మకమలం.