పనిగట్టుకుని నాపై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారు

Published: Wednesday May 26, 2021
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి 
మేడిపల్లి, మే25 (ప్రజాపాలన ప్రతినిధి) : నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తూ, కొందరు  పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ కార్యకర్తగా దాదాపు 20 ఏళ్ల నుంచి ప్రజాజీవితంలో ఉన్న నేను ఏంటో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. నాపైన వచ్చిన వార్తలు తప్పుడు ఆరోపణలు అని ఎమ్మెల్యే ఖండించారు. కాప్రా మండలంలోని ప్రభుత్వ భూమి వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులకు సహకరిస్తే తప్పు ఎలా అవుతుందని, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను కాపాడవలసిన బాధ్యత నా పైన ఉందని తెలిపారు. అసలు నాపై న్యాయస్థానంలో ఆరోపణలు చేసిన వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదని, గతంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించే విషయంలో కబ్జాదారులు రెవెన్యూ అధికారుల పై దాడికి దిగడంతో పోలీసుల రక్షణ కల్పించాలని డిసిపిని కోరడం జరిగిందని తెలిపారు. ఎవరిపై ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని, ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ భూమి పరిరక్షణ విషయంలో రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చట్టాలను గౌరవించే నేను ఈ విషయాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటని, నాపై నిరాధారమైన అసత్య ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేసి, న్యాయ స్థానంలో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ లు వేముల సంతోష్ రెడ్డి, వనం పల్లి గోపాల్ రెడ్డి, బన్నల ప్రవీణ్ ముదిరాజ్, బేతాళ బాల్రాజ్, పల్ల కిరణ్ కుమార్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు గరిక సుధాకర్, సాయి జైన్ శేఖర్, అరటికాయ భాస్కర్ ముదిరాజ్, చింతల నరసింహారెడ్డి, నంది కంటి శివ, ఏనుగు సీతారాం రెడ్డి, వినీష్ రెడ్డి, జౌండ్ల ప్రభాకర్ రెడ్డి, బాజీ భాష సాయి కుమార్, శ్రావణ్ రెడ్డి, పల్లె నర్సింగ్ రావు, వేముల పరమేష్, స్వీట్ హౌస్ రాజు ఐలేష్, సూరం శంకర్, జెసిబి రాజు తదితరులు పాల్గొన్నారు.