జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు అస్వస్థత

Published: Saturday September 17, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 16, ప్రజాపాలన : జాతీయ సమైక్యత ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు అస్వస్థత, మంచిర్యాలలో శుక్రవారం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అస్వస్థతకు గురై కావడం  పట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ విచారం వ్యక్తం చేశారు. 11 మంది విద్యార్థులు ఎండ తీవ్రతకు డీహైడ్రషన్ కు గురై ఆసుపత్రిలో చేరడం బాధకరమన్నారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. దాదాపు రెండు గంటలు ఎండలో కూర్చోపెట్టడమే కాకుండా కనీసం త్రాగునీరు వసతి కల్పించకపోవడం క్షమార్హం కాదని అన్నారు. మూడు కిలో మీటర్ల దూరం ఎండలో చిన్న పిల్లలను నడిపించడం చూస్తుంటే కార్యక్రమం విజయవంతం పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ఆరోగ్యంపై లేనట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ కార్యక్రమాలకు విద్యార్థులను భాగస్వాములను చేయడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల యజమానులు కూడా విద్యార్థులను చదువుకు మినహా, వారిని ఏ కార్యక్రమాలకు పంపవద్దని సూచించారు. విద్యా శాఖ అధికారులు విద్యార్థులను ఆయా కార్యక్రమాలకు   పంపించాలని ఆదేశిస్తే సహించేది లేదని సురేఖ స్పష్టం చేశారు.