బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం

Published: Wednesday April 27, 2022
మర్పల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్
వికారాబాద్ బ్యూరో 26 ఏప్రిల్ ప్రజాపాలన : బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని మర్పల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ అన్నారు. భావి సమాజం నిర్మాణం కోసం ఆడపిల్లల చదువు అత్యంతావశ్యకమని గుర్తు చేశారు. సోమవారం సాయంత్రం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో ఎస్బిఐ బ్యాంకు దగ్గర పోలిస్ శాఖ సామాజిక అవగాహన కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలిస్ కళా బృందం వారు పలు సందేశాత్మక వీడియోలు ప్రదర్శించి పాటల ద్వారా ప్రజలలో చైతన్యవంతం కలిగించారు. మర్పల్లి ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వికారాబాద్ ఎస్పి కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండని ఆడ పిల్లలకు పెండ్లి చేయడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. బాల్య వివాహలు చేస్తే 1098 లేదా 100 పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు లైసెన్స్ తో పాటు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని హితవు పలికారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు అన్నారు. యువకులు డ్రగ్స్ మద్యం గంజాయి వంటి వాటికీ దూరంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న యువత వికారాబాద్ లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.  సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒటిపి నంబర్ లు ఇతరులకు చెప్పవద్దని ఏమైనా అనుమానం ఉంటే బ్యాంకు అధికారులను సంప్రదించాలని స్పష్టం చేశారు. శాంతి భద్రతల రక్షణలో ప్రజలు సహకరించాలని మర్పల్లి పోలీసులు ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర ఆశోక్ మాట్లడుతూ .. అనునిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో తలమునకలై ఉండే పోలిసులు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచడం అభినందనీయమని కొనియాడారు. కరోనా కష్ట కాలంలో పోలీసుల సేవలు మరువలేనివని గుర్తు చేశారు. నేరాల నియంత్రణ కోసం గ్రామంలో 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గ్రామంలోని ముఖ్యమైన సమస్యలు మొదటి ప్రాధాన్యతగా తీసుకొని వాటిని పరిష్కారం చేయుటకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. మతసామరస్యానికి ప్రతీకగా గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ అన్నదమ్ములుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.