తోలు తీస్తా....నంటూ ఆశా వర్కర్లపై హెల్త్ ఆఫీసర్ జులుం

Published: Monday December 05, 2022

ఇదేమి బూతు పురాణం అంటూ మండిపడుతున్న మహిళలు  అశ్వారావుపేట ప్రజా పాలన (ప్రతినిధి) : తోలు తీస్తా..... నంటూ ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగి మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వినాయకపురం పిహెచ్సి పరిధిలోని అశ్వారావుపేట ఆశా వర్కర్లతో  అశ్వారావుపేట లో జరిగిన మీటింగులో హెచ్ ఈ ఓ గా పనిచేస్తున్న అజ్మీర వెంకటేశ్వరరావు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అనేక రకాలుగా దూషించారని పలువురు ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో సంవత్సరాలుగా అనేక కష్టనష్టాలకోర్చి ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నామని, కనీసం మా వయసుకు కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ మమ్మల్ని అగౌరవపరుస్తున్నారని కొందరు వాపోతున్నారు. సంస్థలో మేము చిన్న చిన్న ఉద్యోగులమని, ఎదురు మాట్లాడితే ఏమవుతుందోనని భయపడుతూ ఉద్యోగం చేయాల్సి వస్తుందని, ఎన్నో రకాల అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికి, మమ్ములను బానిసలుగా చూడటం సహించలేకపోతున్నామని, కొందరు ఆశ వర్కర్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. హెచ్ఈవోగా పనిచేస్తున్న ఆఫీసర్ దమ్మపేట, పట్వారి గూడెం, గుమ్మడవల్లి, వినాయకపురం తదితర ఏరియాలలో యూనిట్ ఆఫీసర్ గా పని చేస్తారని, అందరూ ఎంతో గౌరవంగా చూస్తామని, కానీ సదరు ఆఫీసర్ ఈ విధంగా ప్రవర్తించడంతో ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్నామని, గతంలో అనేక మార్లు ఈ విధంగా అవమానాలకు గురైనా ఎవరు ఎదురు మాట్లాడలేదని, ఇదే అదనుగా భావించిన సదరు అధికారి ఇటువంటి మాటలతో వేధింపులు నిత్యకృత్యమయ్యాయని, ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఇటువంటి అధికారులపై తగు చర్యలు తీసుకొని, మా గౌరవాన్ని కాపాడాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఈ విషయమై సదరు అధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.