దళితులను, గిరిజనులను అడుగడుగునా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్: ఏఐసీసీ కోఆర్డినేటర్ ప్

Published: Monday August 23, 2021
బోనకల్లు, ఆగస్టు 22, ప్రజాపాలన ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ 7 ఏళ్ల పాలనలో దళితులను, గిరిజనులను అడుగడుగునా మోసం చేసుకుంటూ వస్తున్నారని ఇక ఆ మోసాలను సాగనివ్వబోమని ఏఐసిసి కోఆర్డినేటర్, మధిర నియోజకవర్గ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సమన్వయకర్త రాపోలు జయ ప్రకాష్ ఘాటుగా విమర్శించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గా రావు ఇంట్లో శనివారం  ఆ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం జరిగేది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ హామీలన్నీ మోసాలేనని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని చెప్పి నేటి వరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో మూడు లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదన్నారు. దళిత బంధు లాగే గిరిజన బంధు కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మధిర నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని దళిత కుటుంబాల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో 10 లక్షల రుణం కోసం దరఖాస్తులు అందజేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దామోదర రాజ నరసింహ నేతృత్వంలో సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తొక్కి క్యారీ ఫార్వర్డ్ అని దొంగ మెలిక పెట్టి లక్షా 25 వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ నిధులను సగం కూడా ఖర్చు చేయకుండా కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కు మళ్లించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద దళితులకు ఒక్క ఎకరం భూమి కూడా లేదన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన దాడులు ఎక్కువగా జరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత రాబందేనని విమర్శించారు. కెసిఆర్ పేదల విద్యను సర్వనాశనం చేశారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ అమలు చేయకుండా దళితులకు, పేదవారికి వైద్యానికి దూరం చేశారని విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేసి ఉంటే దళితులకు గిరిజనులకు, రిజర్వేషన్ కోటా కింద దాదాపు 30 వేల ఉద్యోగాలు వచ్చేవి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ దళిత బంధు నాటకమాడుతున్నారని ఈ నాటకాలు ఇక సాగవని  హెచ్చరించారు. ఆదివాసీలకు కాంగ్రెస్ అండగా నిలిస్తే కెసిఆర్ శాపంగా మారాడు అని విమర్శించారు. దళితుల ఆత్మగౌరవంతో బతకాలంటే ఆస్తులు ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా దళితుల అందరి చేత దరఖాస్తులు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎం శేఖర్ గౌడ్ యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగరాజు యాదవ్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు పైడిపల్లి కిషోర్ కుమార్ బంధం. నాగేశ్వర రావు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్ మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు ముఖ్య బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.