ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరుగకుండా ముందస్తు చర్యలపై కలెక్టర్ సమావేశం

Published: Tuesday March 02, 2021
వికారాబాద్ జిల్లా మార్చ్ 01 ( ప్రజాపాలన ప్రతినిధి ): వేసవిలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరుగకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా నీటి సరఫరా సక్రమంగా అందించాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు పుష్కళంగా ఉన్నందున  జిల్లాలోని అన్ని నివాసాలతో పాటు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్ లకు నీరు అందించాలని ఆదేశించారు.  అంగన్వాడీ కేంద్రాలలోని గర్భిణీలు, చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.  ఎన్ఆర్ఈజిఎస్ కార్మికులు వడదెబ్బ తగలకుండా వారికోసం షామియానాలు, నీటి సదుపాయంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకేట్లు అందుబాటులో ఉంచాలని కోరారు.  వేసవిలో నీటి సరఫరా వాటర్ ట్యాంకులను శుభ్రంగా కడిగి క్లోరినేషన్ చేయాలని, నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. రోడ్లపై పిచ్చిగా తిరిగే అనాథలకు ఆశ్రయం కోసం ఒక ప్రత్యేక షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాలలో కనీసం వారానికి ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహించి వడదెబ్బకు గురికాకుండా చూడాలని, అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువులు మృత్యు వాత పడకుండా వేసవిలో వాటికి అవసరమైన నీరు, పశుగ్రాసం అందేలా చూడాలని,  పశుగ్రాసం కొరత రాకుండా నీటి సదుపాయాలు ఉన్న ప్రాంతాలలో గడ్డి మొక్కలు పెంచాలని తెలిపారు. పశు వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. రైతు వేదికల ద్వారా రైతులు వేయవలసిన పంటలు, పశు సంరక్షణ తదితర అంశాలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. విద్యుత్తుకు అంతరాయం, షాట్ సర్క్యూట్ లు జరుగకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.