పోలీస్ శాఖకు ప్రభుత్వం అవసరమైన తోడ్పాటు హోం మంత్రి మహమూద్ అలీ

Published: Thursday February 02, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 1 (ప్రజాపాలన ప్రతినిధి)
పోలీసు శాఖ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమవంతు ప్రోత్సాహం ఎల్లపుడూ ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఉప్పల్లో ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ నూతన భవన సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోం మంత్రి మహమూద్ అలీ  పాల్గొని ప్రారంభించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ పోలీసు శాఖ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమవంతు  సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందిస్తూనే ఉందని తెలిపారు. ఎన్నో నూతన పోలిస్ స్టేషన్ భవనాలు మరియు ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. సిసిటివిల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని, నేర దర్యాప్తులో, నేర నియంత్రణలో సిసిటివిలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నారు. పోలీసు శాఖ రాత్రి పగలు తమ విధులను అలుపెరగకుండా నిర్వహించడం వల్లే రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అభినందించారు.రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి శ్రీ మల్లారెడ్డి మాట్లాడుతూ పోలిస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, వారికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకపోవడం వల్లే సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందింది అన్నారు.
తెలంగాణ డీజీపీ అంజని కుమార్  మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు నిబద్ధతతో పని చేస్తున్నారని, పోలీసు శాఖలోని పలు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు.
రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహాన్  మాట్లాడుతూ విస్తీర్ణపరంగా దేశంలోనే అతి పెద్దదైన రాచకొండ కమిషనరేట్ నేర నియంత్రణలో కూడా అగ్ర స్థానంలో ఉందని, సిసిటివిల నిర్వహణ ద్వారా నేర దర్యాప్తు అతి త్వరగా సాధ్యం అవుతోందని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలతో పాటు, సమీప జిల్లాల గ్రామీణ ప్రాంతాలు కూడా కలిసి ఉన్నాయని, అయినా పోలీసులు రాత్రి పగలు నిబద్ధతతో పనిచేస్తూ నేర శాతం అదుపులో ఉంచుతూ శాంతి భద్రతలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. రాచకొండ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తామని తెలిపారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ నూతన భవన సముదాయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హోం మంత్రి, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి, డీజీపి గారికి మరియు ఇతర గౌరవ అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత, తెలంగాణ పోలిస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీసీపీ-1 ట్రాఫిక్  అభిషేక్ మహంతి ఐ.పి.ఎస్,  డీసీపీ-2 ట్రాఫిక్ శ్రీనివాస్, డీసీపీ మల్కాజ్ గిరి జానకి ధరావత్ ఐ.పి.ఎస్, డీసీపీ ఎల్బి నగర్ సాయి శ్రీ,  డీసీపీ అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు డీసీపీ షమీర్, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసిపిలు మరియు ఇతర రాచకొండ అధికారులు పాల్గొన్నారు.