ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాలి

Published: Friday March 10, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన :
ఈనెల 13న నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.

గురువారం జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల నోడల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి వరకు పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు.  పోలింగ్ కేంద్రాలకు ఉన్న తలుపులు, కిటికీలన్నీ లాక్ అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులైన విద్యుత్తు, ఫ్యాన్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. నోడల్ అధికారులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ మెటీరియల్ అన్ని పరిశీలించుకుని సిద్ధం కావాలన్నారు.  బ్యాలెట్ బాక్స్ లపై పోలింగ్ స్టేషన్ నంబర్లను స్పష్టంగా అగుపించేలా స్టిక్కర్లు వేసుకోవాలని, రూట్ ఆఫీసర్లు ఐదు రూట్లలో ఐదు వాహనాలను సిద్ధం చేసుకొనాలని సూచించారు.  ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అప్పజెప్పిన బాధ్యతలను అందరూ పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని, ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే తనను సంప్రదించి తెలుసుకోవాలని అన్నారు.  పోలింగ్ సిబ్బందికి మంచి వసతి భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు.