కరోనా నియంత్రణకు సభ్యులకు దిశ నిర్దేశం

Published: Monday May 17, 2021
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడిపల్లి, మే16 (ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కరోనా రెండవ దశ నియంత్రణలో భాగంగా  నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో చామకూర మల్లారెడ్డి  పాల్గొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో మంత్రి మల్లారెడ్డితో పాటు   పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయిర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కమీషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వార్డుకమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణ చేయవలసిన కార్యక్రమాలపై సభ్యులకు దిశనిర్దేశం చేశారు. కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రతి డివిజన్ పరిధిలో ఇంటింటి సర్వే ను వేగవంతం చెసి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందిస్తున్న మందులను పంపిణీ చేయాలన్నారు. తద్వారా కరోనా నియంత్రణ లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చెసిన కోవిడ్ కేర్ సెంటర్ పనితీరుపై హర్షం వ్యక్తం చేసారు. రాష్ట్రంలోనే కోవిడ్ బాధితులకోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి కోవిడ్ కేర్ సెంటర్ ఇదే కావడం జిల్లాకే గర్వకారణం అన్నారు. మరియు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దీనిని ఆదర్శంగా తీసుకొని వారి పరిధిలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే కరోనా బాధితులకోసం మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దాదాపు 300 పడకలతో కూడిన కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని, నాచారంలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో దాదాపు 200 పడకలతో ఏర్పాటు కానున్న కోవిడ్ వార్డు పనులు చివరి దశలో ఉన్నాయని త్వరలో అందరికి అందుబాటులోకి రానుందని అదేవిదంగా జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోవిడ్ ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుందని బాధితులకు అవసరమైన మందులు, రేమిడిసివర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, మొదలైన అన్ని అత్యవసర సామాగ్రి అందుబాటులో ఉన్నాయని మంత్రి ఇ మల్లారెడ్డి తెలిపారు.