బాలలను సంరక్షించడానికి ఆపరేషన్ ముస్కాన్ -08 సిద్ధం జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు

Published: Wednesday June 29, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 28(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా బాలల హక్కులకు రక్షణ కల్పించడానికి ఆపరేషన్ ముస్కాన్ -08 బృందాన్ని సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ లోని సంబంధిత అధికారులతోప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మాట్లాడుతూ పిల్లలు అని లో కాదు.. బడిలో ఉండాలని,
 బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలన కావాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
 జూలై 01నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా బాలలను గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, తద్వారా పాఠశాలలో చేర్పించడం జరుగుతుందని తెలిపారు. 18 సం లోపు తప్పిపోయిన, కార్మికులుగా పనిచేస్తున్న బాల కార్మికులు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి సంబంధిత అధికారులు  వారిని వెట్టిచాకిరీ నుండి విముక్తులను చేయడం జరుగుతుందన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలకార్మికులను గుర్తించినవారు డయాల్ -100 లేదా1098 కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిపిఓ మహేష్, ఎస్బి సిఐ సుధాకర్, శ్రీనివాస్, ఎస్ఐ సాగర్, తదితరులు పాల్గొన్నారు.